తెలంగాణలో బీజేపీ ‘బెంగాల్’ ఫార్ములా

ఎగ్జిట్ పోల్స్ వచ్చేయడంతో బీజేపీ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. ఇదే ఊపులో దేశంలో విస్తరించాలని యోచిస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిన జాతీయ పార్టీల బలం లేని రాష్ట్రాలలో తమ పార్టీ పాత్రను పెంచాలని బీజేపీ నేతలు డిసైడ్ అయ్యారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో తెలియగానే తెలంగాణ బీజేపీ నేతల్లో ఆశలు చిగురించాయి. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ వచ్చినా.. అమిత్ షా వచ్చి ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు ఆ పార్టీని పట్టించుకోలేదు. 118 స్థానాల్లో పోటీచేస్తే 103 నియోజకవర్గాల్లో డిపాజిట్ పోగొట్టారు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని కూడా నేలకేసి కొట్టారు.

ఈ నేపథ్యంలో కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ఐదేళ్లలో తెలంగాణలో ప్రతిపక్షంగా ఎదగాలని బీజేపీ నేతలు యోచిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ వలసలతో కుదేలైన వేళ…. బీజేపీ పార్టీని గ్రామస్థాయి నుంచి విస్తరించాలని…. బీజేపీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం డిసైడ్ అయ్యింది.

కేంద్రంలో బీజేపీ వస్తే దాని అండదండలతో పార్టీని ప్రక్షాళన చేసి తెలంగాణలో బలపడడమే ఎజెండాగా ముందుకు వెళ్లాలని బీజేపీ యోచిస్తోంది. 2014లో పశ్చిమ బెంగాల్ లో కూడా బీజేపీ ఉనికే లేదని.. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లకు పైగా అక్కడ గెలుస్తుందంటే అది బీజేపీ విస్తరణ ప్రభావమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మన్ చెప్పుకొచ్చారు.

దశాబ్ధాలుగా అక్కడ పాలించిన కమ్యూనిస్టులు ఇప్పుడు ఉనికిలో లేకుండా పోయారని.. బీజేపీ మాత్రం తృణమూల్ కు బలమైన ప్రతిపక్షంగా తయారైందని లక్ష్మన్ చెప్పారు. అలానే తెలంగాణలోనూ బలపడుతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను విలీనం చేసుకోవాలని అందరినీ లాగేస్తున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్థానంలోకి బీజేపీ రావాలని అడుగులు వేస్తోంది. భవిష్యత్ లో తెలంగాణలోనూ బెంగాల్ తరహాలోనే బీజేపీ విస్తరించేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బెంగాల్‌లో బలమైన మమతనే బీజేపీ ఎదురించిందని…. ఇక్కడ కేసీఆర్ ను అలానే ఎదుర్కొంటామని బీజేపీ అధ్యక్షుడు ధీమాగా చెబుతున్నారు. మరి బీజేపీ ఎంత వరకు కేసీఆర్ ను ఎదిరిస్తుందనేది వేచిచూడాలి.