టీమిండియా అమ్ములపొదిలో స్పిన్ ట్విన్స్

  • ప్రపంచకప్ కు భారత జాదూ స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ 
  • మణికట్టుతో మాయచేసే స్పిన్ జోడీ
  • చాహల్, కుల్దీప్ ల సత్తాకు ప్రపంచకప్ పరీక్ష

బ్యాట్స్ మన్ స్వర్గధామం, ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం భారత నవతరం స్పిన్ జోడీ చాహల్, కుల్దీప్ యాదవ్ ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్, లెఫ్టామ్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తమ స్పిన్ జాదూతో ప్రపంచకప్ లో టీమిండియాను విజేతగా నిలపాలన్న పట్టుదలతో ఉన్నారు.

స్పిన్నర్ల పుట్టిల్లు భారత్…

భారత్ అంటే….స్పిన్ బౌలింగ్ కు మరో పేరు. భారత్ అంటే ఎందరో గొప్పగొప్ప స్పిన్నర్లకు చిరునామా. 

ఇటీవలి కాలంలో….ఫాస్ట్ బౌలింగ్ లో పుంజుకొని… స్పిన్ బౌలింగ్ లో కాస్త వెనుకబడిన టీమిండియాకు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా కొత్తఊపిరి పోశారు.

అశ్విన్ లాంటి అపార అనుభవం ఉన్న స్పిన్నర్ ను ……టెస్ట్ క్రికెట్ కే పరిమితం చేయాలని భారత టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించడంతో…..ఇప్పుడు వారి వారసులుగా….వన్డే, టీ-20 జట్లలో స్థానాలు భర్తీ చేయటానికి… ఇద్దరు నవతరం స్పిన్నర్లు దూసుకొచ్చారు. 2019 ప్రపంచకప్ లో కీలకపాత్ర పోషించడానికి తాము సిద్ధమంటూ తమ అసాధారణ ప్రతిభతో ఇప్పటికే చాటుకొన్నారు.

ఇద్దరు ఇద్దరే….

గత ఏడాది కాలంలో వివిధ దేశాలతో ముగిసిన వన్డే, టీ-20 సిరీస్ ల్లో టీమిండియా అలవోక విజయాలలో 27 ఏళ్ల లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహాల్, 23 ఏళ్ల ఎడమచేతివాటం… చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రధానపాత్ర వహించారు.

ఐపీఎల్ లో నిలకడగా రాణించడం ద్వారా…. సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన చాహల్, కుల్దీప్..2017, 18 సీజన్లో… జరిగిన స్వదేశీ సిరీస్ ల్లో…ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక జట్ల పై తమ సత్తా ఏపాటిదో చాటుకొన్నారు.

కుల్దీప్ చైనామన్ స్పిన్…

23 ఏళ్ల చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన కెరియర్ లో ఆడిన మొత్తం 44 వన్డేల్లో 87 వికెట్లు పడగొట్టాడు.
అంతేకాదు…భారత్ విజేతగా నిలిచిన 29 మ్యాచ్ ల్లో కుల్దీప్ 65 వికెట్లు సాధించాడు. కుల్దీప్ వికెట్లు పడగొట్టిన ప్రతిసారీ భారతజట్టు విజయాలు సొంతం చేసుకొంది.

ఇక….భారత్ ఓడిన 12 మ్యాచ్ ల్లో కుల్దీప్ కేవలం 17 వికెట్లు మాత్రమే పడగొట్టడం చూస్తే.. ఎటాకింగ్ స్పిన్నర్ గా కుల్దీప్ భారత్ బౌలింగ్ ఎటాక్ కు ఎంత కీలకమో మరి చెప్పాల్సిన పనిలేదు. కుల్దీప్ అత్యుత్తమంగా 25 పరుగులకే 6 వికెట్లు పడగొట్టడం విశేషం.

లెగ్ బ్రేక్-గుగ్లీ స్టార్ చాహల్…

ఇక…27 ఏళ్ల లెగ్ బ్రేక్- గుగ్లీ బౌలర్ యజువేంద్ర చాహల్ గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది. చాహల్ తన కెరియర్ లో ఇపట్టి వరకూ ఆడిన మొత్తం 41 వన్డేల్లో 72 వికెట్లు పడగొట్టాడు. భారత్ నెగ్గిన 31 మ్యాచ్ ల్లో 67 వికెట్లు… ఓడిన 9 మ్యాచ్ ల్లో 4 వికెట్లు మాత్రమే చాహల్ సాధించాడు.

ఇద్దరూ చెలరేగితేనే…

జీవం లేని ఇంగ్లండ్ అండ్ వేల్స్ పిచ్ లపై భారత్ ప్రపంచకప్ విజేతగా నిలవాలంటే…చాహల్- కుల్దీప్ జోడీ స్థాయికి తగ్గట్టుగా రాణించక తప్పదు. ఈ ఇద్దరి జోడీ కలిసి భారత్ కు 103 వికెట్లు అందించారు.

కుల్దీప్ 28 వన్డేల్లో 60 వికెట్లు..చాహల్ 28వన్డేల్లో 43 వికెట్లు పడగొట్టారు. ఈ ఇద్దరు బౌలర్ల సత్తాకు, స్పిన్ జాదూకు… ప్రపంచకప్ అసలుసిసలు పరీక్ష అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ప్రపంచకప్ లో భారత్ మరోసారి విజేతగా నిలవాలంటే…స్పిన్ జోడీ చాహల్, కుల్దీప్ ఎంతో కీలకమని భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ సైతం ప్రకటించడం చూస్తే…ఈ ఇద్దరు యువస్పిన్నర్లపై బౌలింగ్ భారం ఎంత భారీస్థాయిలో ఉందో మరి చెప్పాల్సిన పనిలేదు.

ఏదిఏమైనా…. ఐపీఎల్ పుణ్యమా అంటూ.. టీమిండియాకు ముగ్గురు నాణ్యమైన…కుర్రకారు స్పిన్నర్లు దొరకడం నిజంగా అదృష్టమే.