ఇది ఫస్ట్ లుక్.. మరి అదేంటి?

సడెన్ గా తెరపైకొచ్చింది సమంత. ఓ బేబీ ఫస్ట్ లుక్ అంటూ హడావుడిగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. సమంత నవ్వులు చిందిస్తోంది.. బ్యాక్ గ్రౌండ్ లో సీరియస్ గా లక్ష్మి ఉంది. ఏదో ఫొటోషూట్ కు స్టిల్ ఇచ్చినట్టుంది తప్ప, సినిమా పోస్టర్ లా, పైపెచ్చు ఫస్ట్ లుక్ లా అస్సలు అనిపించలేదు ఈ ఫొటో.

సరే.. ఈ సంగతి పక్కనపెడితే అసలు ఇది ఫస్ట్ లుక్ ఏంటనేది అందరి సందేహం. ఎందుకంటే ఓ బేబీ సినిమాకు సంబంధించి ఇప్పటికే సమంత స్టిల్స్ వచ్చేశాయి. స్కూటర్ పై సమంత వెళ్తుంటే, వెనక జనాలంతా హంగామా చేసే బ్యూటిఫుల్ స్టిల్ ఆల్రెడీ వచ్చేసింది. అదే ఫస్ట్ లుక్ అంటూ అప్పట్లో యూనిట్ ఊదరగొట్టింది కూడా.

కట్ చేస్తే, మరో ఫస్ట్ లుక్ అంటూ ఈ పోస్టర్ విడుదల చేశారు. ఈ గందరగోళానికి కారణం ఒకటే. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా 55 ఏళ్లు పూర్తిచేసుకుంది. 55 ఏళ్లు పూర్తిచేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్ అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. ప్రెస్ నోట్ రిలీజ్ చేసినా ఫలితం లేకపోయింది.

దీంతో ఈ మేటర్ ను హైలెట్ చేసేందుకు తమ సంస్థపై తెరకెక్కుతున్న ఓబేబీ సినిమా నుంచి స్టిల్ రిలీజ్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ 55 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఓ బేబీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నామంటూ అలా లింక్ పెట్టారు. అలా సినిమాకు సంబంధించి మరో ఫస్ట్ లుక్ రిలీజైపోయింది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ లుక్ లో పార్ట్-2 అనుకోవచ్చు దీన్ని. అదీ అసలు సంగతి.