యాత్రకు సీక్వెల్ తీయడానికి రెడీ !

చారిత్రక విజయాన్నందుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఒక్కటే మిగిలింది. ఈ మొత్తం ఎపిసోడ్ దర్శకుడు మహి వి రాఘవ్ ను మరోసారి ఆకర్షించింది. కుదిరితే యాత్ర సినిమాకు సీక్వెల్ తీస్తా అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు రాఘవ్

దివంగత వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తీశాడు మహి వి రాఘవ్. ఆ సినిమా ప్రతి ప్రేక్షకుడి గుండెను తాకింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు భావోద్వేగానికి గురయ్యారు. అంతలా తన స్క్రీన్ ప్లే, టేకింగ్ తో కదిలించాడు మహి. మళ్లీ ఇన్నేళ్లకు తండ్రి అడుగుజాడల్లో పాదయాత్ర చేసి, తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్నారు జగన్.

యాత్ర సీక్వెల్ కు కావాల్సిన స్టఫ్ మొత్తం జగన్ జీవితంలో, పాదయాత్రలో ఉందని చెప్పుకొచ్చారు మహి. యాత్ర-2 తీస్తానని నేరుగా చెప్పకపోయినా, కొన్నేళ్లుగా జగన్ కు సంబందించిన ఈ మొత్తం వ్యవహారం అతడ్ని కదిలించింది. ఏమో.. త్వరలోనే యాత్ర-2 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.