బాబు క్యాబినెట్ కకావికలం..!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. రాజకీయ ఉద్దండులుగా పేరు తెచ్చుకున్న వారు… తెలుగుదేశం పార్టీలో హేమాహేమీలు అనిపించుకున్న వారు… చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులు అనేకమంది ఎన్నికల్లో మట్టికరిచారు.

చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులలో 19 మంది మంత్రులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతిలో దారుణ పరాజయం పాలయ్యారు. వీరిలో కొందరు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన అనంతరం పదవుల కోసం తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రులు కూడా ఉన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో అన్నీ తానై ప్రభుత్వాన్ని నడిపించిన మంత్రి నారాయణ ఘోర పరాజయం పాలయ్యారు. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా దారుణంగా ఓడిపోయారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ కూడా ఓడిపోయారు. ఇక కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కూడా ఓటమి పాలయ్యారు.

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు గాను, చంద్రబాబు నాయుడు కి అనుంగు అనుచరులుగా ను పేరు తెచ్చుకున్న అయ్యన్నపాత్రుడు, కాలువ శ్రీనివాసరావు వంటి మంత్రులు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్ కూడా దారుణంగా ఓటమి పాలయ్యారు.

ఇక కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి భూమా అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి వై.ఎస్.ఆర్ పార్టీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. వీరితో పాటు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి పొందిన సుజయ వెంకట రంగారావు కూడా పరాజయం పాలు కాక తప్పలేదు.

ఇక పార్టీ సీనియర్ నాయకుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కూడా ఓటమి పాలు కావడం విశేషం. వీరి ఓటమితో తెలుగుదేశం పార్టీ పాలన పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు వంటి ఒకరిద్దరు గెలవడం తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఊరట.