Telugu Global
NEWS

ఏపీలో ప్రక్షాళన దిశగా పార్టీలు...!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ, జాతీయ పార్టీలను కకావికలం చేశాయి. ఈ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలను మట్టి కరిపించింది. 175 శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 151 స్థానాలను కైవసం చేసుకుంది. 25 లోక్ సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 22 ఎంపీ స్థానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరంగా అయ్యాయి. ఈ ఎన్నికల బరిలో నిలిచిన అధికార తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో సుస్థిరమైన […]

ఏపీలో ప్రక్షాళన దిశగా పార్టీలు...!
X

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ, జాతీయ పార్టీలను కకావికలం చేశాయి. ఈ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలను మట్టి కరిపించింది. 175 శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 151 స్థానాలను కైవసం చేసుకుంది. 25 లోక్ సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 22 ఎంపీ స్థానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరంగా అయ్యాయి.

ఈ ఎన్నికల బరిలో నిలిచిన అధికార తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో సుస్థిరమైన మెజారిటీ సాధించిన భారతీయ జనతా పార్టీ, వంద సంవత్సరాలకు పైబడి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఎన్నికలతోనే పురుడు పోసుకున్న జనసేన ఊసులోకి కూడా లేకుండాపోయాయి.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మినహా మిగిలిన పార్టీల అధ్యక్షులు ఎవ్వరూ విజయం సాధించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు రఘువీరారెడ్డి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దారుణమైన ఓటమిని చవి చూశారు. దీంతో ఈ పార్టీల్లో తీవ్ర అంతర్మధనం ప్రారంభమయ్యిందని అంటున్నారు. ఈ మూడు పార్టీలను సంస్థాగతంగా పటిష్టం చేయాలని ఆయా పార్టీల అధిష్టానం నిర్ణయించుకున్నట్లు సమాచారం.

పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని సోనియాగాంధీతో సహా ఇతర సీనియర్ నాయకులు ఎవరూ స్వాగతించ లేదు.

ఇదే దారిలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్థానంలో మరో యువనేతను పార్టీ అధ్యక్షుడిగా నియమించి మరింత చురుకుగా వ్యవహరించేలా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇక కేంద్రంలో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలపై కన్ను వేసింది. ఎవరు ఊహించని విధంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నాలుగు స్థానాలు దక్కాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలలో పటిష్టం చేసేందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ స్థానంలో వేరొకరికి అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో నాయకత్వం కూడా మార్చాలని, రానున్న ఐదు సంవత్సరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోను మరింత బలపడాలనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా చెబుతున్నారు.

ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల కంటే సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు మరొక నాయకుడికి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలున్నాని అంటున్నారు. తాను వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతు వేరొకరిని అధ్యక్షుడిగా నియమించి పార్టీ వ్యవహారాలను చక్కబెట్టాలని ఆయన ఆలోచనగా చెబుతున్నారు.

మొత్తానికి ఈ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన అన్ని పార్టీలను ఆత్మరక్షణలో పడేసింది అని అంటున్నారు.

First Published:  24 May 2019 9:46 PM GMT
Next Story