మరికొద్ది గంటల్లో ఫ్రెంచ్ ఓపెన్ సమరం

  • జోకోవిచ్, నడాల్ కు మొదటి రెండు సీడింగ్స్ 
  • జ్వరేవ్ కు మూడు, డోమనిక్ కు నాలుగు సీడింగ్స్ 
  • మహిళల సింగిల్స్ లో నవోమీకి టాప్ సీడింగ్ 
  • 10వ సీడ్ గా సెరెనా విలియమ్స్

2019 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ లో సీడింగ్స్ ను నిర్వాహక సంఘం ప్రకటించింది. పారిస్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే రెండువారాల ఈ ఎర్రమట్టి సమరం..పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్, స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ లకు మొదటి రెండు సీడింగ్స్ దక్కాయి.

క్లే కోర్టు స్పెషలిస్ట్ లు జ్వరేవ్ కు మూడు, డోమినిక్ థీమ్ కు నాలుగు సీడింగ్స్ ఇచ్చారు. డిఫెండింగ్ చాంపియన్ నడాల్, 2009 విన్నర్ ఫెదరర్ 2015 తర్వాత కలసి ఫ్రెంచ్ ఓపెన్లో పోటీకి దిగుతున్నారు. డ్రా ప్రకారం ఈ ఇద్దరూ సెమీస్ లోనే తలపడాల్సి ఉంది.

తొలిరౌండ్లో ఇటలీ ఆటగాడు లోరెంజోతో 37 ఏళ్ల ఫెదరర్ ఢీ కొంటాడు. రెండో సీడ్ నడాల్ మాత్రం… మొదటి రెండు రౌండ్లలో.. క్వాలిఫైయర్స్ తోనే పోటీ పడాల్సి ఉంది.

టాప్ సీడ్ జోకోవిచ్ మాత్రం తన తొలిరౌండ్ మ్యాచ్ ను పోలెండ్ కు చెందిన 43 ర్యాంక్ ఆటగాడు హ్యూబెర్ట్ తో తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లోనే యువసంచలనం జ్వెరేవ్ తో జోకోవిచ్ తలపడనున్నాడు.

సరికొత్త రికార్డుకు నడాల్ సిద్ధం…

క్లేకోర్టు టెన్నిస్ లో తనను మించిన మొనగాడు లేడని ఇప్పటికే చాటుకొన్న స్పానిష్ బుల్ నడాల్… రికార్డుస్థాయిలో 12వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కు గురిపెట్టాడు.

యువఆటగాడు జ్వేరేవ్, టాప్ సీడ్ జోకోవిచ్, డోమనిక్ థీమ్ ల నుంచి నడాల్ కు గట్టిపోటీ ఎదురు కానుంది.

మహిళల టాప్ సీడ్ నవోమీ…

మహిళల సింగిల్స్ బరిలోకి నవోమీ ఓసాకా టాప్ సీడింగ్ ప్లేయర్ గా టైటిల్ వేటకు దిగుతోంది. మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ 10వ సీడ్ గా పోటీకి సిద్ధమయ్యింది.

తొలిరౌండ్లో అన్నా కారోలినాతో టాప్ సీడ్ నవోమీ పోటీపడుతుంది. డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హాలెప్ మూడోసీడ్ గా పోటీకి సిద్ధమయ్యింది. కారోలినా ప్లిసికోవా రెండోసీడ్ గా తన అదృష్టం పరీక్షించుకోనుంది.

భారీగా పెరిగిన ప్రైజ్ మనీ…

మే 26 నుంచి జూన్ 9 వరకూ జరిగే ఫ్రెంచ్ ఓపెన్ విజేతలకు..గత ఏడాదికంటే 8శాతం అదనంగా ప్రైజ్ మనీ
చెల్లించనున్నారు. పురుషుల, మహిళల చాంపియన్లకు చెరో 18 కోట్ల రూపాయల చొప్పున నజరానాగా అందచేస్తారు.