Telugu Global
NEWS

ఒకే వేదికపైకి కేసీఆర్, జగన్, మోడీ?

మన దేశ ప్రధానితో ఏపీ, తెలంగాణ సీఎంలు ఒకే వేదిక పంచుకొని దాదాపు ఐదేండ్లు అయ్యింది. అప్పట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడానికి వచ్చారు. ఆ వేదిక మీద ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు కనిపించారు. ఆ తర్వాత అనేక కారణాల వల్ల వీరు ముగ్గురూ ఒకే వేదిక పంచుకోలేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన అనేక పరిణామాలతో కేసీఆర్, చంద్రబాబు మధ్య పెద్ద అగాధం […]

ఒకే వేదికపైకి కేసీఆర్, జగన్, మోడీ?
X

మన దేశ ప్రధానితో ఏపీ, తెలంగాణ సీఎంలు ఒకే వేదిక పంచుకొని దాదాపు ఐదేండ్లు అయ్యింది. అప్పట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడానికి వచ్చారు. ఆ వేదిక మీద ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు కనిపించారు. ఆ తర్వాత అనేక కారణాల వల్ల వీరు ముగ్గురూ ఒకే వేదిక పంచుకోలేదు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన అనేక పరిణామాలతో కేసీఆర్, చంద్రబాబు మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. ఇద్దరి మధ్య గొడవలు కాస్తా ఏపీ, తెలంగాణ గొడవల్లాగ తయారయ్యాయి. అంతే కాకుండా గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఏకంగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టారు. దీంతో వీరిద్దరి మధ్య యుద్దం మరింత తీవ్రమైంది.

మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా మోడీతో గొడవ పెట్టుకున్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోడీ ఓటమే లక్ష్యంగా పని చేశారు. చివరకు టీడీపీకి 3 పార్లమెంటు స్థానాలే వచ్చాయి. మరోవైపు వైసీపీ ప్రభంజనంతో ఏపీలో అధికారం కూడా కోల్పోయాడు.

ఏపీ, తెలంగాణ రెండు సోదర రాష్ట్రాలు. గత ఐదేండ్లుగా ఎప్పుడూ గొడవలే.. ఎప్పటికైనా సఖ్యతగా ఉంటాయా అనే అనుమానాలను ఏపీకి కాబోయే సీఎం జగన్ పటాపంచలు చేయబోతున్నారు.

ఇప్పటికే జగన్‌కు కేసీఆర్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తాడేపల్లిలో జరిగే వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశం తర్వాత జగన్ హైదరాబాద్‌లో గవర్నర్‌ను కలవనున్నారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం అవుతారు. 30వ తేదీన విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్నారు.

జగన్ 26వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ రోజు ప్రధాని మోడీతో మర్యాదపూర్వక భేటీలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయనను 30వ తేదీన జరిగే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్నారు.

ఈ నెల 29న మోడీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాతి రోజే జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. కాబట్టి మోడీ రావడానికి పెద్దగా ఇబ్బంది ఉండదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఒక వేళ మోడీ రావడం ఖరారు అయితే ప్రధాని మోడీతో పాటు ఏపీ, తెలంగాణ సీఎంలు ఒకే వేదిక పంచుకోవడం ఖాయమే. ఐదేండ్ల తర్వాత ఈ ఘటన పునరావిష్కృతం అవుతున్నట్లే.

First Published:  24 May 2019 8:59 PM GMT
Next Story