ఆంధ్రా వైపు చూస్తున్న తెలంగాణ ఐపీఎస్‌లు..!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి కాబోతుండటంతో కొంత మంది ఐపీఎస్‌ల చూపులు ఆంధ్రాపై పడ్డాయి. తెలంగాణ క్యాడర్‌లో పని చేస్తున్న వీళ్లు ఏపీకి వెళ్లాలనే యోచనలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పని చేసిన ఐపీఎస్‌లలో కొందరు జగన్ ప్రభుత్వంలో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

ఐపీఎస్ అధికారులకు ఇంటర్ స్టేట్ డెప్యుటేషన్ అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఇటీవల చాలా మంది పోలీసు అధికారులకు పదోన్నతులు లభించినా ఎన్నికల కోడ్ వల్ల బదిలీ కాలేదు. వారు తమ హోదా కంటే తక్కువ పోస్టుల్లోనే పని చేస్తున్నారు. అలాంటి వారే ఇప్పుడు ఏపీకి వెళ్లాలని అనుకుంటున్నారట.

జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత ఐపీఎస్ అధికారుల బదిలీలపైనే దృష్టి పెట్టే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ ఐపీఎస్‌లు బదిలీ కోసం దరఖాస్తు చేశారట. ఆరుగురు ఐపీఎస్‌లు ఏపీలో పని చేయడానికి సుముఖంగా ఉన్నారట. వీరిలో ఒక ఐపీఎస్ జగన్‌ను కలిసినట్లు తెలుస్తోంది.

ఇక మరో ఇద్దరు ఐపీఎస్‌లు కేంద్ర సర్వీసుకు వెళ్లడానికి అభ్యర్థన పెట్టారట. వీరిలో డీఐజీ అకున్ సబర్వాల్, సంతోష్ మెహ్రాలు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్ 27 ముగియగానే వీరి బదిలీకి రాష్ట్ర హోం శాఖ పచ్చజెండా ఊపనున్నట్లు సమాచారం.