ఔను…. అక్కడ రెండు చరిత్రలు….

‘మనం చరిత్ర సృష్టించబోతున్నాం…ఇది తరతరాలకు గుర్తుండిపోతుంది’ పోలింగ్ ముగిశాక కౌంటింగ్ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అధినేత పదే పదే చెప్పిన మాటలు ఇవి. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ చిరకాలం గుర్తుండేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ సీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఇది ఒక చరిత్ర అయితే, తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయంతో తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకోవడం మరో చరిత్ర. ఈ రకంగా చంద్రబాబు చెప్పినట్టుగానే ఆంధ్ర ప్రజలు రెండు చరిత్రలను లిఖించారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తొమ్మది నెలలలోనే పార్టీని అధికారంలోకి తెచ్చారు. తాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి తెలుగువారి ఖ్యాతిని చాటి చెప్పారు. 1994లో కుట్రలతో టీడీపీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు నందమూరి కుటుంబాన్ని పార్టీకి దూరంగా ఉంచి తానే సర్వాధికారి అయ్యారనేది పరిశీలకుల మాట.

చివరకు టీడీపీకి తన తరువాత కుమారుడు లోకేశ్ ను అధిపతిని చేయాలనుకున్నారని, ఈ క్రమంలో పార్టీ అనేక ఒడిదుడుకులకు లోనయ్యిందని అంటున్నారు. 2014లో ఆయాచితంగా లభించిన అధికారాన్ని కూడా పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేశారనే ఆరోపణలూ వ్యక్తమయ్యాయి. దీంతో విసిగిపోయిన జనం 2019 ఎన్నికలలో చరిత్రాత్మక తీర్పును ఇచ్చారని అంటున్నారు.

జగన్ కు ఎంతటి ఘన విజయాన్ని కట్టబెట్టారో… అంతే ఘనంగా చంద్రబాబును కొడుకుతో సహా ఇంటికి పంపించారని చెబుతున్నారు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కోరుకున్నట్టుగానే చరిత్ర సృష్టించిందనే వ్యంగ్య వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ పుట్టిన తరువాత ఎన్నో ఉత్థాన పతనాలను చవి చూసిందని, కానీ, తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతినడం మాత్రం ఇదే మొదటిసారని అంటున్నారు. చంద్రబాబు అనుకున్నంతా చేశారని వారిలో వారు చర్చించుకుంటున్నారట.

అయితే చంద్రబాబుకు ఎదురైన ఈ తీరని అవమానంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆత్మకు నిజమైన శాంతి లభించి ఉంటుందని, పార్టీకి చెందిన ఆనాటి తరం నాయకులు అభిప్రాయపడుతున్నారట. ఈ రకమైన శాస్తి చంద్రబాబుకు జరిగి తీరాల్సిందే అని అంటున్నారట.