బాబును మోసం చేసిన ఎల్లోమీడియా

(చంద్రబాబు ఘోరంగా ఓడిపోయాడు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అయితే చంద్రబాబు ఓటమికి సగం కారణం ఆయన అయితే, మరో సగం కారణం ఎల్లోమీడియా. ఆయనకు నిజాలు తెలియకుండా ఆయన కళ్ళకు పసుపు గుడ్డ కట్టేసింది మీడియా. ఆయనను విజయవంతంగా పదవికి దూరం చేసింది మీడియా. ఇంకా ఇప్పటికీ కూడా ఆయనకు తెలియకుండా భ్రమలు పెడుతూనే ఉంది. ఓటమికి కారణం ఆయన కాదని, ఎవరెవరి మీదో నిందలు వేస్తోంది. ముఖ్యమంత్రిగా సూపర్ సక్సెస్ అయ్యాడని, పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఫెయిల్ అయ్యాడని కొత్త భ్రమల్లో పెడుతోంది. మీడియాని అరివీరభయంకరంగా పోషించి ఆ మీడియా వల్లే ప్రజలకు దూరమైన నాయకుడు చంద్రబాబు. మీడియాను అడ్డం పెట్టుకుని జనాలకు భ్రమలు కల్పిద్దామని అనుకున్నాడు చంద్రబాబు. అయితే డబ్బులకోసం చంద్రబాబునే భ్రమల్లో పెట్టింది మీడియా…. ప్రజల మనోగతం ఆయనకు తెలియనీయకుండా..! ఇప్పటికీ భ్రమలు పెడుతోంది. అయితే చంద్రబాబు పాలన ఎలా సాగిందో…. ఈ దుస్థితికి ఆయన ఎలా కారకుడో ఓ పౌరుడు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు పాఠకులకు అందిస్తున్నాం….)

జగన్ 175కిగాను 151, 25కిగాను 22 సీట్లతో వూడ్చేసిన విజయం చాలామందికి అర్థంకాకపోవచ్చు. “వీడి మొహం చూసి అర్థరాత్రిదాకా మహిళలు క్యూలైన్లలో నిలబడి వోట్లేశారా?”అని కోపంలో నోరుజారిన సంభోదనలో పబ్లిగ్గా మీడియాముందు సమాజాన్ని చంద్రబాబు నిలదీసి ప్రశ్నించిన దానికి జవాబు ఆల్రెడీ వచ్చేసిందిగానీ, పరిశీలించి చూస్తే, నిజానికి జగన్ పట్ల సానుకూలతతోనేగాక, తనపట్ల వ్యతిరేకతతో కూడా ఓటేశారని, ఈ అనుకూల వ్యతిరేకతలు రెండూ పతాక స్థాయిలో చేరినప్పుడు అర్థరాత్రిదాకా క్యూలైన్ల ఫలితాలే ఇప్పుడు మనం చూస్తున్నామని అర్థం చేసుకోవాలి.

ఒక చరిత్ర ముగిసింది. ఈ రాష్ట్రంలో శక్తివంతమైన ఒక కులం భారతదేశంలో అత్యంత పతనమైన గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం గా కీర్తించినట్లు అతనికాలాన్ని, ముఖ్యంగా అతడిని కీర్తించవచ్చుగాక, కానీ ఏది స్వర్ణం? ఏది సత్తు? అని తవ్వడం మొదలుపెడితే శిథిలాలమాటున పతనాలన్నీ ఓపికున్న చరిత్రకారుడెవడైనా రాయకమానడు. అంతలోగా స్థూలంగా-

మోసమే తెలివిగా, పరిస్థితుల్ని దిగజార్చి తనకు అనుకోవడమే మేనేజ్ మెంటుగా చెప్పుకుంటే అటువంటి తెలివి, మేనేజ్మెంట్ వ్యవస్థల్ని, సమాజాన్ని సహజంగానే పతనంలో పడేస్తాయి. ఈ రాష్ట్రంలో అసలు మనుషుల్ని బహాటంగా కొనడం నేర్పింది ఆయనే. ఓట్లను కొనే ప్రక్రియకి ఆద్యుడు ఆయనే. యంత్రాంగాలూ, వ్యవస్థల్లో మనుషులే వుంటారని, వారికీ బలహీనతలుంటాయని, డబ్బు, వ్యామోహాలూ, పదవులు, కీర్తులు ఎరగావేసి ఆ బలహీనతల్ని కొల్లగొట్టి వాడుకోవచ్చని ఆయనే నేర్పించారు. పార్టీనీ, పదవినీ లాగేసుకున్నాక, అధికారంకోసం అందివచ్చే గడ్డిపోచనుకూడా వదలని ఆయన ప్రపంచస్థాయి సంస్థలని కాదనలేదు. ప్రపంచబ్యాంకుకు ఈ రాష్ట్రాన్ని కుదువపెట్టేశారు. సగర్వంగా ఈ రాష్ట్రం ఒక కంపెనీ అనీ, తాను దానికి సీఈవో అనీ ప్రకటించుకున్నారు. ఏ ఇజం లేదని లేదని టూరిజం మాత్రమే వుందని తీర్పు చెప్పేశారు.

ఇంటికి పెద్దమనిషే గేట్లెత్తేశాక పిల్లలు ఎలా నీతిలేకుండా, డబ్బుమయమై, కోరికల కుప్పై ఎలా పెరగాలో ఈ రాష్ట్ర ప్రజలు అలా ఎదిగారు. కులం, మీడియా, పత్రికలు, సినిమాలు, అధికార యంత్రాంగాలతో పాటు అది అత్యున్నత న్యాయవస్థకూ దాన్నిపాకించారు. ఆయనమీద చర్యలదాకా వస్తే, దేశ అత్యున్నత పరిశోధనా సంస్థలచేత “సరిపోయినంత స్టాఫ్ లేద”నిపిస్తే, న్యాయస్థానాలచేత “నాట్ బిఫోర్” అనిపించగలిగారు. చివరకు ప్రజలమందు ససాక్ష్యంగా పట్టుబడినందుకు సాక్స్యం నిలబడిన ప్రజలు హైదరాబాద్ వంటి నగరాన్ని వదులుకున్నారేగానీ అతనికి కించిత్ నష్టం కలగలేదు.

ఏమైనా మాట్లాడొచ్చు, ఎన్ని అబద్దాలైనా నమ్మించవచ్చనే ధైర్యంలో ఎన్ని తప్పులు జరిగాయో లెక్కేలేదు. అతను కౌగిళించున్న ప్రతి పార్టీ, వ్యక్తీ గొప్పవాళ్లుగా మిగిలారు, కాదనుకున్నప్పుడు అదేపార్టీ, వ్యక్తి అంతగా పతనమూ అయ్యారు. కావాలంటే ఇదే మోడీ గురించి ఐదేళ్లక్రితం పత్రికలు చదవండి, అంతవెనక్కిపోలేమంటే అతడిచ్చిన మట్టి, నీరు, గాలీ, ఆకాశం.. ఒకప్పుడు పంచభూతాలు గా ఎందుకు పరిగణింపబడ్డాయో తర్వాత మన్నూ, నీళ్లు ఎలాగయ్యాయో అడగండి. నిజానికి అతడి చర్యల్ని, మాటల్ని ప్రశ్నించలేని సామాన్యులు అతడు గుడ్లురుముతాడని భయపడి గుడ్లనీరుకక్కుకుంటూ మిగిలిన వైనం గమనించండి.

23మంది ఎమ్మెల్యేలనూ, 3ఎంపీలను ఎదుటిపార్టీనుండి కొన్నా, కొందరికి ఏకంగా పదవులు కట్టబెట్టినా, రెండెకరాల నుండి ఇండియాలో అత్యున్నత సంపన్న ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కినా కూడా ఎటువంటి మొహమాటం లేకుండా ఆయన అమాయక ప్రజలకే కాదు ప్రజాస్వామ్యం వంటి ప్రపంచస్థాయి వ్యవస్థలకీ విలువలమీద లెక్చర్లివ్వగలరు. ఆలోచనలు, సిద్ధాంతాలతో పాటు మొబైల్ ఫోన్ వంటి వస్తువులనూ ఆయనే తెచ్చానని ఆయన చెప్పుకున్నారు, ప్రపంచ సాంకేతిక నిపుణులనుండి క్రీడాకారులవరకూ, వారి విజయం వెనక అతడే నిలబడ్డారు, నగరాలు నిర్మింపచేసారు, ప్రపంచ రాజధానికి డిజైన్లు గీయించారు, ఏకంగా ప్రకృతితో పోటీపడి పట్టిసీమ అనే ఒక నదిని సృష్టించారని పత్రికలు అచ్చొద్దాయి.

ఆయన తెలివిమంతుడు. ఎవరు చెప్పారు ఈ మీడియా, పేపర్లు కాకపోతే? 40ఏళ్ళ రాజకీయంలో ఒక్క భాషైనా అదీ రోజువారీ జీవితానికి పనికొచ్చేది నేర్చుకున్నారా? ప్రపంచమంతా తిరుగుతూ దానికి పలు విషయాలు పరిచయం చేసిన ఈయన తునిరైలు దగ్దమయినప్పుడు మాట్లాడిన ప్రపంచ భాష “ఇంపగ్న్ డ్”(ఇంప్యూన్డ్-impugned -ఇన్నేళ్ల పాలనలో రోజూసంతకాలు పెట్టే జీవోల్లో తరచూ వినే ఇంగ్లిష్) పదానికి పట్టిన దుస్తితి తెలియజేస్తుంది. ఓకాలంలోనే ప్రధాని పదవిని తిరస్కరించిన ఈ”చక్ర”ధారి నోటిన ఎన్నడైనా హిందీ పదం విన్నామా? మొన్నొక డిల్లీ పాత్రికేయమితృడన్నాడు, “మీ సీయం వస్తే, భాష విషయంలో ఇక్కడి రాజకీయనాయకులకేకాదు, మాకూ చావుకొస్తుంది” అని.

ప్రపంచబ్యాంకు ఏజెంటుగా చేసిన నష్టం అపారం. దానికి వ్యతిరేకంగా తిరగబడిన జనం మీద చేసిన అణచివేత దారుణం. హైదరాబాద్ నడివీధుల్లో గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపిమరీ తాననుకున్నట్లు పాలించారు. ఉద్యోగాలకోసం పోతే కంప్యూటర్ నేర్చుకుని అమెరికా వెళ్లమని సలహాలిచ్చారు. అసలు సామాజిక శాస్త్రాలతో సమాజానికి పనిలేదని ప్రకటించారు. అలా అనరాదన్న విద్యావేత్తలని మూడుచెరువుల నీళ్ళు తాగించారు. వ్యవసాయం వృధా అన్నరు, వస్తూత్పత్తి విలువలేదన్నారు, కేవలం జనాలకి తిండిపెట్టేది కంప్యూటర్లేనని అవెన్నడూ చూడని జనంచేత ఒప్పించారు. పల్లెల్లో ఒక కొత్త దళారీ వ్యవస్థని సృష్టించారు, దానికి అందుబాటులో మద్యదుకాణాలు తెరిచారు. విద్య, వైద్యాల్ని ప్రైవేటుపరం చేసి ప్రజల్నుండి దూరం చేశారు.

ఒకరకంగా చెప్పాలంటే ఆయన ఆలోచనలు, వాటినుండి రూపొందిన విధానాలు, వాటిని అమలు పరచిన పద్దతులు ఒక వ్యక్తిమీద రుద్దితే ఏర్పడిన ప్రతిచర్యకు రూపం జగన్. జగన్ నీతిమంతుడు అననుగానీ, తండ్రి మరణానంతంతం, జనంలోకి జగన్ రావడంతోనే కాంగ్రెస్ తో కలిసి క్విడ్ ప్రోకో అన్నారు, అయితే కేసులేసిన వ్యక్తి, వేయించిన వ్యక్తి, సంబంధిత యంత్రాంగం, విచారించిన వ్యక్తులు దీనిలోని డొల్లతనాన్ని ఇదివరకే ప్రకటించగా, చాలా వరకు కోర్టులూ కొట్టేశాయి.

ఆరోపణకూ, నిర్దారణకూ తేడా లేకుండా అతడు లక్షకోట్ల (ఈ అంకెలు రూపొందించిన వ్యక్తే స్వయంగా అవి వండివార్చిన లెక్కలుగా తేల్చడం మరోవిషయం) అవినీతిపరుడిగా తీర్పులిచ్చి విజయవంతంగా ప్రజల్ని నమ్మించాయి మేనేజ్ చేయబడిన పత్రికలూ, వ్యవస్థలూ. 16నెలల జైలుజీవితం విధించాయి. అతడు తన రెక్కల కష్టమ్మీద గెలిపించుకున్న ఎమ్మెల్యేలని లాక్కోవడమేగాక వారిచేతనే అదే అసెంబ్లీలో తిట్టించారు, “పాతేస్తారా నా కొడకా” అనిపించారు, అతడు సభలో మాట్లాడకుండా “దొంగ దొంగ” అంటూ రన్నింగ్ కామెంట్ చేసారు, సభ బయట పూచికపుల్లకు పోలని మనుషులతో అడ్డగోలుగా తిట్టించారు.

అతడు నడిచిన రోడ్లను పసుపునీళ్లతో శుద్దిచేయించారు. చివరకు అతడిని చంపాలని జరిగిన హత్యాయత్నం “కోడికత్తి” అని ఎగతాళి చేయబడింది. ఎన్నికల సమయంలో అతని బాబాయిని క్రూరంగా నరికి చంపేసి మానసికంగా దెబ్బతీయడమేగాదు, అది తిరిగి అతనిమీదే మోపి ఎన్నికల ప్రచారం సాగింది. ఈ చర్యలన్నీ అతన్ని ఒక శక్తివంతుడైన ప్రత్యర్థిగా తీర్చి దిద్దడమే గాక, అతని అభిమాన ఓటర్లలోనే గాక, తటస్తులనూ సానుభూతిపరుల్ని చేసారు.

నిజానికి నిన్న హోరాహోరీ ఓటింగ్ వచ్చివుంటే అక్కడే కౌంటింగ్ సెంటర్లలోనే గొడవలు మొదలై, తర్వాత ఈవీయం ల మీద సందేహాలూ, కోర్టుల తీర్పులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఈ కళ్లతో కనాల్సి వచ్చేది. దాన్ని నివారించడానికి కాబోలు, జనం మొత్తం వూడ్చి జగన్ చేతిలో పెట్టారు. చిత్రమేమంటే, సెంట్రల్లో ఎక్కడ చక్రం చేతికి తీసుకుంటారోనని, జనం దాన్ని కూడా దాచేసినట్లుంది!

వంద కళేబరాలను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలడంలో పెద్ద బాధలేదు కానీ నేలకూలిన తర్వాత ఈ ప్రపంచం ఎలా గుర్తుంచుకుంటుందో చంద్రబాబు తన ప్రత్యర్థి రాజశేఖర్ రెడ్డిని చూసైనా మారకపోవడం గమనార్హం. ఇప్పుడున్న ప్రత్యర్థి, తన తండ్రి వారసత్వంతో పాటు చంద్రబాబు ఇచ్చిన అనుభవాల్తో రాటుదేలినవాడు. కాబట్టి చంద్రబాబుకే అవకాశం ఇవ్వకపోయేటప్పుడు, ఇక ఇతడి కొడుకుకి అవకాశం? ఏమో కాలం నిర్ణయించాలి. అఫ్ కోర్స్, అధికారపక్షాలకు నిత్యప్రతిపక్షమైన మాలాంటివాళ్లం రేపటినుండి అతనికొడుక్కి తప్పక తోడుంటాం!

సో, చంద్రబాబుకిక సెలవ్. బట్ నాట్ సే-లవ్. మొత్తానికి అతని తండ్రికే లొంగని చంద్రబాబునిలా వెన్నువంచి మరీ, జనానికి శాశ్విత సెలవు ఇప్పించినందుకు ఈ క్షణానికి జగన్! యూ వోన్ అవర్ హార్ట్!!

-Siddharthi Subhas Chandrabose