ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ లో భారత్ కు షాక్

  • భారత టాపార్డర్ టపటపా
  • భారత్ పై న్యూజిలాండ్ కు 6 వికెట్ల విజయం
  • స్మిత్ సెంచరీతో ఇంగ్లండ్ కు కంగారూ దెబ్బ

ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ ల రెండోరోజున సైతం సంచలనాలు చోటు చేసుకొన్నాయి. పోటీల తొలిరోజున మాజీ చాంపియన్ పాకిస్థాన్ ను పసికూన అప్ఘనిస్థాన్ చిత్తు చేస్తే…రెండోరోజున హాట్ ఫేవరెట్ జట్లు టీమిండియా, ఇంగ్లండ్ కంగు తిన్నాయి.

భారత బ్యాటింగ్ ఆర్డర్ టపటపా….

లండన్ లోని ఓవల్ వేదికగా ముగిసిన ఈ తొలి సన్నాహక మ్యాచ్ లో… టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న టీమిండియా… కివీ స్వింగ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ధాటికి కకావికలైపోయింది.

కేవలం 39.2 ఓవర్లలోనే 179 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 2, శిఖర్ ధావన్ 2, కెప్టెన్ కొహ్లీ 18, రాహుల్ 6, పాండ్యా 30, ధోనీ 17, దినేశ్ కార్తీక్4 పరుగులకు అవుటయ్యారు.

జడేజా ఫైటింగ్ బ్యాటింగ్…

భారత టాపార్డర్ పేకమేడలా కూలిన సమయంలో లోయర్ ఆర్డర్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఎదురొడ్డి నిలిచాడు. ఫైటింగ్ హాఫ్ సెంచరీతో తనజట్టును కొంతమేరకు ఆదుకొన్నాడు. 115 పరుగులకే 8 వికెట్లు నష్టపోయిన టీమిండియాను జడేజా- కుల్దీప్ జోడీ ఆదుకొని…పరువు దక్కించారు.

50 బాల్స్ లో 6 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 54 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ సైతం 19 పరుగుల స్కోరు సాధించాడు.

న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు, నీషామ్ 3 వికెట్లు, గ్రాండ్ హోమీ, సౌథీ చెరో వికెట్ పడగొట్టారు.

రోజ్ టేలర్ షో…

భారత్ ను 179 పరుగులకే కుప్పకూల్చిన న్యూజిలాండ్…180 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగి…కేవలం 4 వికెట్ల నష్టానికే 37.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది.

కెప్టెన్ కేన్ విలియమ్స సన్ 67, మాజీ కెప్టెన్ రోజ్ టేలర్ 71 పరుగులతో తమజట్టువిజయంలో ప్రధానపాత్ర వహించారు.
భారత బౌలర్లలో బుమ్రా, జడేజా, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

భారతజట్టు తన రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతుంది.  బ్రిస్టల్ వేదికగా సౌతాఫ్రికాతో టీమిండియా తన ప్రారంభమ్యాచ్ ఆడాల్సి ఉంది.

ఇంగ్లండ్ కు ఆసీస్ షాక్…

సౌతాంప్టన్ వేదికగా జరిగిన మరో వామప్ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్, ఆతిథ్య ఇంగ్లండ్ పై డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 12 పరుగుల విజయంతో శుభారంభం చేసింది. స్వదేశీ గడ్డపై వరుస విజయాలతో జోరుమీదున్న ఇంగ్లండ్ కు షాకిచ్చింది.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన కంగారూ టీమ్ 297 పరుగులు సాధించింది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 116 పరుగులతో టాప్ స్కోరర్ నిలిచాడు.

బాల్ టాంపరింగ్ ఆరోపణలతో ఏడాదికాలం నిషేధం తర్వాత జాతీయజట్టు తరపున బరిలోకి దిగిన స్టీవ్ స్మిత్ సెంచరీ బాదడం ద్వారా…. తానేమిటో చాటుకొన్నాడు.

చేజింగ్ లో ఇంగ్లండ్ ఫ్లాప్….

298 పరుగుల టార్గెట్ చేజింగ్ కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్ చివరకు 285 పరుగులకే కుప్పకూలింది. విన్సీ 64, బట్లర్ 52 పరుగులు సాధించారు.

కెప్టెన్ వోయిన్ మోర్గాన్, జో రూట్ లాంటి నలుగురు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు ఈ మధ్యకాలంలో ఇదే తొలి ఓటమి కావడం విశేషం.

ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ లో తన ప్రారంభమ్యాచ్ ను సౌతాఫ్రికాతో గురువారం ఆడనుంది.