ప్రభుదేవా సినిమా పోస్ట్ పోన్

ప్రభుదేవా-తమన్న హీరోహీరోయిన్లుగా అభినేత్రి-2 అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ సినిమాతో పాటు ఖామోషీ అనే మరో సినిమా కూడా వస్తోంది. ఆ సినిమా వస్తే ఈ సినిమాకు ఇబ్బందేంటి అనుకోవద్దు. ఈ ఖామోషీ అనే సినిమాలో కూడా ప్రభుదేవా-తమన్నానే హీరోహీరోయిన్లు. ఇలా ఒకే హీరోయిన్, ఒకే హీరో కలిసి నటించిన రెండు సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి వస్తే కలెక్షన్ల సంగతి అటుంచితే రెండు సినిమాలకూ ప్రమాదమే. అందుకే ఇప్పుడీ సినిమాల్లోంచి ఓ సినిమా డ్రాప్ అయింది.

ఈనెల 31న అభినేత్రి-2తో పాటు రావాల్సిన ఖామోషీ సినిమాను వాయిదా వేశారు. వచ్చేనెల 14న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. నిజానికి ఈ విషయంలో మేకర్స్ కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. కాకపోతే అభినేత్రి-2 ప్రచారంతో పోలిస్తే ఖామోషీ ప్రచారం చప్పగా సాగుతోంది. జనాల్లోకి వెళ్లలేదు సినిమా. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేశారు.

ఒకే హీరో నటించిన 2 సినిమాలు ఒకే రోజు రిలీజైన సందర్భాలున్నాయి. కానీ ఇలా హీరోహీరోయిన్లు కలిసి నటించిన సినిమాలు ఒకే రోజు ఎప్పుడూ రిలీజ్ అవ్వలేదు. ఈసారి కూడా అది జరగలేదు. దీంతో అభినేత్రి-2 యూనిట్ ఖామోషీ యూనిక్ కు కృతజ్ఞతలు చెప్పింది. అభినేత్రి-2 సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఖామోషీ సినిమాను కేవలం హిందీ-తమిళ్ లో మాత్రమే ప్లాన్ చేశారు.