చంద్రబాబు దత్తత తీసుకున్న గ్రామం…. డిపాజిట్ కోల్పోయిన టీడీపీ అభ్యర్థి

ఏపీలో వైసీపీ సృష్టించిన సునామీకి తెలుగుదేశం పార్టీలోని హేమాహేమీలు, మంత్రులు కొట్టుకొని పోయారు. చివరకి చంద్రబాబు కూడా గతంలో కంటే సగం మెజార్టీతోనే సరిపెట్టుకొవాల్సి వచ్చింది. జగన్ పాదయాత్ర, నవరత్నాల వంటి హామీలతో వైసీపీ రికార్డు విజయాన్ని సాధించింది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అందరూ చర్చించుకునేది అరకు అసెంబ్లీ నియోజకవర్గం గురించే.

గత ఏడాది మావోయిస్టుల చేతిలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందారు. ఆ కుటుంబానికి నేనున్నానంటూ చంద్రబాబు చనిపోయిన ఎమ్మెల్యే కొడుకు కిడారి శ్రవణ్‌కు మంత్రి పదవి ఇచ్చారు. అయితే చట్ట సభకు ఎన్నిక కాకపోవడంతో ఓట్ల లెక్కింపుకు 10 రోజుల ముందు రాజీనామా చేశారు శ్రవణ్. అప్పటికే ఆయన అరకు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

కాగా, అరకులో ఫలితాల తర్వాత కిడారికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. అక్కడ వైసీపీ అభ్యర్థి 25, 495 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి సియ్యారి దొన్ను దొర 27,660 ఓట్లు సంపాదించారు. కాని టీడీపీ అభ్యర్థి శ్రవణ్ కేవలం 19,929 ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయారు. 175 నియోజకవర్గాల్లో టీడీపీ డిపాజిట్ కోల్పోయింది కేవలం అరకులో మాత్రమే.

ఇక ఇదే నియోజకవర్గంలో ఉన్న పెదలబుడు పంచాయితీని చంద్రబాబు దత్తత తీసుకున్నారు. స్మార్ట్ విలేజ్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు. ఆ గ్రామ పంచాయితీకి లెక్కలేనన్ని వరాలు ఇచ్చారు. అయితే ఆ వరాలేవీ తీర్చలేదు. దాంతో అక్కడి ఓటర్లు చంద్రబాబు ఋణం తీర్చుకున్నారు.