మాటమీద జగన్…. మోడీ వద్దకు….

సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు…. మూడేళ్లుగా ప్రజల్లో ఉంటూ కష్టపడ్డ జగన్ కు జనం ప్రతిఫలం ఇచ్చారు. ఇప్పుడు జనం ఇచ్చిన గొప్ప బాధ్యతను జగన్ నెరవేర్చే పనిలో పడ్డారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టకముందే ఆ గురుతర బాధ్యత కోసం ప్రధాని మోడీ వద్దకు కోర్కెల చిట్టాతో వెళ్లడం విశేషం.

రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలుపడంతోపాటు…. విభజన హామీలు, హోదా గురించి చర్చించాలని పీఎంవోకు జగన్ అపాయింట్ మెంట్ కోరారు. దీనికి మోడీ కూడా సై అన్నారు. ఏకంగా గంటకు పైగా టైమ్ కేటాయించారు.

జగన్, ఎంపీలు విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులతో కలిసి జగన్ తాజాగా మోడీతో భేటీ అయ్యారు. విభజన సమస్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇప్పటికే హోదా సాధిస్తానని జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు.

ఎక్కువ పార్లమెంట్ సీట్లను ఇస్తే కేంద్రంతో పోరాడుతానన్నారు. ప్రజలు కూడా 22 ఎంపీ సీట్లను గెలిపించారు. అన్నట్టుగానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్ ఆ పని మొదలు పెట్టారు.

ఇప్పటికే హోదా సాధ్యం కాదంటూ టీడీపీ శ్రేణులు తప్పుడు ప్రచారం మొదలు పెట్టాయి. కేంద్రం నుంచి రూపాయి సాధించలేడని ఆరోపిస్తున్నాయి. ఆ తప్పుడు ప్రచారానికి చెక్ పెడుతూ…. జగన్ ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ తీసుకొని కలిశారు. ఏకంగా హోదా ఇవ్వాలని అందులో కోరినట్టు సమాచారం. ఇలా మాటలతోనే కాదు.. జగన్ చేతలతోనూ…. తాను వెనుకడుగు వేయనని స్పష్టం చేశారు.