Telugu Global
Arts & Literature

సాహిత్యం విలువ తెలిసిన ప్రచురణకర్త " జోషి

ప్రేరేప పూర్ణ చంద్ర జోషి. ఇంటి పేరు చూస్తే తెలుగువాడని, చివరన జోషి చూస్తే ఉత్తరాదివాడనిపిస్తుంది. జోషీల మూలాలు ఉత్తరాఖండ్ లో ఉన్నాయి. కాని, రాజస్థాన్, గుజరాత్, కర్నాటకలోనూ ఈ పేరు ఉన్నవారు ఉన్నారు. కానీ పి.పి.సి. జోషి పదహారణాల తెలుగువాడే. 1940 జులైలో గోదావరి మండలంలోని ఆచంటలో జన్మించారు. ఆయన తండ్రి మృత్యుంజయుడు తెలంగాణ సాయుధ పోరాటానికి వెన్నుదన్నుగా ఉన్న వారు.

సాహిత్యం విలువ తెలిసిన ప్రచురణకర్త  జోషి
X

ప్రేరేప పూర్ణ చంద్ర జోషి. ఇంటి పేరు చూస్తే తెలుగువాడని, చివరన జోషి చూస్తే ఉత్తరాదివాడనిపిస్తుంది. జోషీల మూలాలు ఉత్తరాఖండ్ లో ఉన్నాయి. కాని, రాజస్థాన్, గుజరాత్, కర్నాటకలోనూ ఈ పేరు ఉన్నవారు ఉన్నారు. కానీ పి.పి.సి. జోషి పదహారణాల తెలుగువాడే. 1940 జులైలో గోదావరి మండలంలోని ఆచంటలో జన్మించారు. ఆయన తండ్రి మృత్యుంజయుడు తెలంగాణ సాయుధ పోరాటానికి వెన్నుదన్నుగా ఉన్న వారు.

సాయుధ పోరాట సమయంలో దాష్టీకం తెలంగాణ ప్రాంతానికే పరిమితం కాలేదు. ఈ పోరాటానికి దన్నుగా ఉన్నందుకు సర్కారు జిల్లాల్లో కూడా పోలీసులు అనేక అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ క్రమంలోనే 1950 మే 16న రాజమండ్రి దగ్గరలో సారంగధర మెట్ల దగ్గర పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ తనికెళ్ల సుబ్బారావు మృత్యుంజయుడిని కాల్చి చంపారు.

మృత్యుంజయుడికి సాయుధ పోరాట సమయంలో అజ్ఞాత వాసంలో ఉంటున్న చండ్ర రాజేశ్వర రావు, పుచ్చలపల్లి సుందరయ్య ఎక్కడున్నారో తెలుసు. చితగ్గొట్టినా ఆయన నోరు విప్పలేదు. మృత్యుంజయుడిని కాల్చేందుకు కానిస్టెబుళ్లు వెనుకాడితే నేనే కాల్చవలసి వచ్చింది అని తనికెళ్ల సుబ్బారావు ఆ తర్వాత చెప్పారు.

మృత్యుంజయుడు "చావుకు వెరవకురా" అనే స్వీయ రచనను స్ఫూర్తిదాయకంగా పాడే వారట. ఆయన జీవితమూ అదే రీతిలో గడిపారు. కమ్యూనిస్టు పార్టీ అభిమానులు తమ బిడ్డలకు మృత్యుంజయుడు పేరు పెట్టుకున్నారు. ఆ పేరుతో నరసాపురంలో ఒక వీధి, గ్రంథాలయం ఉన్నాయి. పాలకొల్లు బాలికలు మృత్యుంజయుడి బుర్ర కథను ప్రదర్శించినప్పుడల్లా ప్రేక్షకులు కళ్ల నీళ్ల పర్యంతమయ్యే వారు. బొల్లిముంత శివరామకృష్ణ "మృత్యుంజయులు" నవలకు కొంత ప్రేరణ మృత్యుంజయుణ్ని కాల్చి చంపడం కూడా.

మృత్యుంజయుడు తన కుమారుల్లో ఒకరికి కమ్యూనిస్టు పార్టీ తొలి ప్రధాన కార్యదర్శి పి.సి. జోషి పేరు పెట్టుకున్నారు. అంటే తండ్రిని పోగొట్టుకునే నాటికి జోషీకి పదేళ్లే. తండ్రి పోలీసుల కిరాతకానికి బలైనా పెద్దయిన తరవాత పి.పి.సి. జోషి అదే బాటలో నడిచారు. సికింద్రాబాద్ ఇస్లామియా ఉన్నత పాఠశాలలో హై స్కూలు, ఆంధ్రా లయోలా కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీలో జోషి చదువు సాగింది. కొంతకాలం న్యూ సైన్స్ కాలేజీలో డెమాన్స్ట్రేటర్ గా పని చేశారు.

ఆ తరవాత పూనా వెళ్లి ఎం.ఎస్.సి. చదివారు. 1953లో మొదట డి.వి. సుబ్బారావు, తరవాత మణ్యం మేనేజర్లుగా పని చేశారు. జోషీ మూడవ మేనేజరయ్యారు. జోషి మేనేజర్ గా ఉన్న కాలంలోనే మయకోవ్ స్కీ రాసిన వి.ఐ.లెనిన్ కావ్యాన్ని శ్రీ శ్రీ చేత, మగ్జిం గోర్కీ అమ్మ నవలను క్రొవ్విడి లింగ రాజు 1932-33లో జైలులో ఉన్నప్పుడు అనువాదం చేశారు. గద్దె లింగయ్య 1934లోనే గోర్కీ అమ్మ నవల తెలుగులో ప్రచురించారు. క్రొవ్విడి లింగ రాజు అనువాదం జోషి విశాలాంధ్ర మేనేజర్ గా ఉన్న సమయంలోనే అచ్చయింది.

కమ్యూనిస్టు ప్రణాళికను రా.రా. (రాచమల్లు రామచంద్ర రెడ్డి) అనువదించడం వెనకా జోషి కృషి ఉంది. ఇతరల భాషల సాహిత్యాన్ని అనువదింప చేయాలనుకున్నప్పుడు జోషి కొన్ని నియమాలు పాటించే వారు. రచయితల ప్రయోగాలను యదేచ్ఛగా మార్చనిచ్చే వారు కాదు. రచయిత అభిప్రాయాన్నో, పండితుల అభిప్రాయమో తీసుకోవాలన్న జాగ్రత్త ఉండేది. డా. పరుచూరి రాజారాం అనేక వైద్య గ్రంథాలను తెలుగులోకి తీసుకు రావడం వెనక ఆయన ప్రయత్నం విస్మరించలేనిది. ఈ శ్రద్ధ "సుందరా కాండను అనువదించడానికి హనుమంతుడికి" పంపుతారు అనేదాకా వెళ్లింది.

ఈ మధ్య కాలంలో విశాలాంధ్ర, నవచేతన ప్రచురణాలయాలు విశిష్ట రచయితల సమగ్ర సంపుటాలు ప్రచురించే పద్ధతి అనుసరిస్తున్నాయి. ఇందులోనూ జోషి చొరవ ఉంది. 1980-81లో కొడవటిగంటి కుటుంబ రావు (కొ.కు.) రచనలను సంపుటీకరించే బాధ్యతను డా. కేతు విశ్వనాథ రెడ్డికి అప్పగించారు. కొ.కు. రచనలను విషయానుసారంగా కేతు సంకలించారు. దీనికి ప్రోద్బలం మళ్లీ జోషీదే. కొ.కు. రచనలను సంపుటీకరించడానికి అనుమతి సంపాదించడానికి బాగానే శ్రమపడవలసి వచ్చింది. కొ.కు. రచనల సంపుటీకరణ కోసం కేతు కొంత కాలం జోషి ఇంట్లోనే మకాం. కేతుకు స్వయంగా వండి భోజనం పెట్టే వాడు. వట్టికోట ఆళ్వార్ స్వామి రచనలను సంపుటీకరించాలనీ జోషి అనుకున్నారు.

ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి కారణం జోషికి ఉన్న సాహిత్యాభిలాషే కారణం. అయిన ఉత్తమ పాఠకుడు. రచయితల మీద అపారమైన గౌరవం. కొంత కాలం జోషి దిల్లీలో సి.పి.ఐ. కేంద్ర కమిటీ కోశాధికారిగా ఆ తరవాత పీపుల్స్ పబ్లిషింగ్ హౌజ్ జనరల్ మేనేజర్ గా పని చేశారు.

ఆ తరవాత హైదరాబాద్ చేరుకుని ప్రాచీ పబ్లికేషన్స్ ప్రారంభించారు. జోషి వామపక్ష భావజాలం ఉన్న సాహిత్యాన్నే కాకుండా చాలా అరుదైన గ్రంథాలు ప్రచురించారు. డి.వి. గోపాలా చార్యులు రాసిన అరుదైన "మాధవ నిదానం" ఆయుర్వేద గ్రంథాన్ని వెలువరించారు. వెత్సా వెంకట శేషయ్య సంస్కృతాంధ్ర నిఘంటువు, కాశీనాథుని నాగేశ్వర రావు ఆంధ్ర వాంగ్మయ సూచిక, చిలకమర్తి స్వీయ చరిత్రము, యెనమండ్రం వెంకట్రామయ్య పురాణ నామ చంద్రిక మొదలైన అపురూప గ్రంథాలు ప్రచురించింది జోషీనే.

జోషి ప్రేమాస్పదుడు. 2016 జులైలో కొంపెల్ల శర్మ నడిపే "తెలుగు రథం" కాళోజీ మీద నన్ను మాట్లాడమని కోరింది. ఆ విషయం తెలుసుకున్న జోషి, వకుళాభరణం రామకృష్ణ నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి వస్తాం అయితే నువ్వు మాట్లాడిన తరవాత వెళ్లిపోతాం అని ముందే చెప్పి అలాగే చేశారు. ప్రచురణకర్తలు చదువరులు అయినందువల్ల సాహిత్యాభిరుచిని పెంపొందింప చేయవచ్చునని నిరూపించినవాడు జోషి.

-ఆర్వీ రామారావ్

First Published:  27 May 2019 4:33 AM GMT
Next Story