రెండో ప్రపంచకప్ కు రోహిత్ రెడీ

  • 206 వన్డేల్లో 8వేల 10 పరుగులు
  • మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్ రోహిత్
  • ప్రపంచకప్ లో భారత్ కీలక ఆటగాడు రోహిత్ శర్మ

వన్డే క్రికెట్లో ..టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ….ప్రపంచకప్ లో సైతం కీలక పాత్ర పోషించడానికి సిద్ధమయ్యాడు. డాషింగ్ ఓపెనర్ గా పరుగుల మోత మోగించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

రోహిత్ శర్మ…మనదేశంలోని కోట్లాదిమంది క్రికెట్ అభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ లాంటి…వీరబాదుడు ఫార్మాట్లలో….రోహిత్ శర్మను మించిన భారత క్రికెట్ మొనగాడు మరొకరు మనకు కనిపించరు.

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను మూడుసార్లు చాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మ….వన్డే క్రికెట్లో ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా, స్టాప్ గ్యాప్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇంగ్లండ్ వేదికగా ప్రారంభమయ్యే 2019వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు వైస్ కెప్టెన్ కమ్ ఓపెనర్ గా సేవలు అందించనున్నాడు.

కెరియర్ లో రెండో ప్రపంచకప్…

తన కెరియర్ లో తొలిసారిగా 2011 ప్రపంచకప్ కు ఎంపికైన రోహిత్ శర్మ… ప్రస్తుత 2019 ప్రపంచకప్ లో మాత్రం పూర్తిస్థాయిలో బరిలోకి దిగబోతున్నాడు.

రెండోసారి ప్రపంచకప్ లో పాల్గొంటున్న రోహిత్…అత్యుత్తమస్థాయిలో రాణించడం ద్వారా చిరస్మరణీయంగా నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

2007 నుంచి 2019 వరకూ…

2007 సీజన్లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ…ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

గత పుష్కరకాలంలో రోహిత్ ఆడిన మొత్తం 206 వన్డేల్లో 8వేల 10 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి. 47.3 సగటు నమోదు చేసిన రోహిత్ …వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు. 

డబుల్ సెంచరీల హీరో…

వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీలు సాధించడం రోహిత్ కు ఏమాత్రం కొత్తకాదు. 2013 సిరీస్ లో ఆస్ట్రేలియాపై తొలిసారిగా ద్విశతకం సాధించిన రోహిత్ శర్మ..ఆ తర్వాతి రెండు డబుల్ సెంచరీలు…శ్రీలంకపైనే నమోదు చేయడం విశేషం.

2014 సిరీస్ లో….264 పరుగుల ప్రపంచ రికార్డు డబుల్ సెంచరీ సాధించిన రోహిత్…ఆ తర్వాత మూడేళ్ల విరామం తర్వాత…మొహాలీలో మరో ద్విశతకం నమోదు చేయగలిగాడు.

ప్రపంచకప్ పైనే ఆశలు…

ఇంగ్లండ్ లోని పరుగుల గనుల లాంటి వికెట్ల పై జరిగే ప్రపంచకప్ లో భారీస్కోర్లు సాధించాలన్న పట్టుదలతో రోహిత్ ఉన్నాడు. పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా జరిగే మొత్తం తొమ్మిది మ్యాచ్ ల్లో రోహిత్ సెంచరీల మోత మోగించే అవకాశం ఉంది.

శిఖర్ ధావన్ తో కలసి భారత బ్యాటింగ్ ప్రారంభించే రోహిత్..గప్టిల్ పేరుతో ఉన్న 237 పరుగుల ప్రపంచకప్ రికార్డును తిరగరాయాలన్న పట్టుదలతో ఉన్నాడు.

తాను కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతానని..ఫలితం ఆశించకుండా మనపని మనం చేసుకుపోడమే ఉత్తమమని రోహిత్ గట్టిగా నమ్ముతున్నాడు.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టుకు…తనవంతుగా బాధ్యతలు నిర్వర్తించడానికి పూర్తిస్థాయిలో సిద్ధమని తెలిపాడు.