పవన్‌ను దగ్గరగా చూస్తే భరించలేం – విజయ్‌ బాబు

పవన్‌ కళ్యాన్‌…. జనసేన…. ఒక విచిత్రమైన ఎపిసోడ్‌ అన్నారు మాజీ ఆర్టీఐ కమిషనర్‌ విజయ్‌ బాబు. గతంలో ప్రజారాజ్యం పరిస్థితి ఏంటో ప్రజలకు తెలిసిన విషయమేనని…. కొంత విరామం తరువాత జనసేన అంటూ వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ సొంతంగా పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ పార్టీలతో కలిసి వెళ్ళాడని గుర్తుచేశారు.

జనసేన స్థాపించినప్పుడు ఒక యంగ్‌స్టర్‌ పార్టీ పెట్టాడని ప్రజలు ఆశగా పవన్‌ వైపు చూశారని…. మెడీ, అమిత్‌ షా వంటి జాతీయ నాయకులు కూడా స్టేజీ మీద పక్కన కూర్చోబెట్టుకుని శెహబాష్‌ అన్నారన్నారు. సినిమా అభిమానం, స్టార్‌ డమ్‌తో ఒక పొలిటికల్‌ ఫిగర్‌గా ఓవర్‌ నైట్‌ ఎస్టాబ్లిష్‌ అయిన వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అని అన్నారు.

అయితే ఆ తరువాత రాష్ట్ర పరిస్థితులపై అవగాహన తెచ్చుకోకుండా ఉన్నట్టుండి ఏకాంతంలోకి వెళ్ళిపోవడం, అదృశ్యం అయిపోవడం, తరువాత కొద్దిరోజులకు బయటకు రావడం ఏంటో అర్థం కాలేదన్నారు. రాజకీయాలంటే నిరంతర ప్రవాహం లాంటిదని ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని…. కానీ పవన్‌ ఆపని చేయలేకపోయారన్నారు.

రాత్రికి రాత్రికి మనసు మార్చుకుని…. ప్రత్యేక హోదా ఇవ్వకుండా పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్‌ కేంద్రంపై మండి పడ్డారన్నారు. అలా ఆయనకున్న అభిమానులు, యూత్‌ ఫోర్స్‌తో ప్రత్యేక హోదాపై పోరాటం చేయకుండా సైలెంట్‌ అయిపోయాడని గుర్తుచేశారు. ఇలా పవన్‌ అప్పుడప్పుడు స్టేట్‌ మెంట్‌ లు ఇచ్చి తమాషాలు చేసేవారన్నారు.

గ్రామ, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటుచేయకుండా కాలయాపన చేసి… ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుంటూరు సభలో ఒక్కసారిగా టీడీపీపై సంచలన కామెంట్స్‌ చేసి మళ్లీ సైలెంట్‌ అయిపోయాడన్నారు. 22 మందికి పైగా సీనియర్ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలోకి వస్తామన్నా తీసుకోలేదన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ మనస్తత్వం పరిశీలిస్తే…. విపరీతంగా పుస్తకాలు చదివానని, అధ్యయనం చేశానని ప్రచారం చేసుకున్నారన్నారు. దాన్ని అందరితోపాటు తాను కూడా నమ్మానన్నారు విజయ్‌ బాబు. చిరంజీవిలాంటి పెద్ద స్టార్‌… ఏమైనా విషయం తెలియకపోతే రాసివ్వమని కోరేవారని, కానీ పవన్‌ కళ్యాణ్‌ మాత్రం అన్నీ నాకే తెలుసు, నేను ఒక కారణ జన్ముణ్ణి, ఈ జనం కోసం నేను పుట్టాను… అన్న మహా మేథావి స్థితిలో…. ఒకరు నాకు సలహాలు ఇచ్చేదేంది అనే స్థితిలో పవన్‌ ఉండేవారన్నారు. ఎవరైనా సలహాలు ఇస్తే పక్కకు తోసేసే తత్వం అన్నారు విజయ్‌ బాబు. తాను పవన్‌ను దగ్గరగా చూశానని ఆయన మనస్థత్వం ఇలాంటిదేనన్నారు.

జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఒక సలహాదారుడిని పెట్టుకున్నాడని… ఆయన సలహాలను కూడా పరిగణనలోకి తీసుకుని…. ఇప్పుడు సక్సెస్‌ అయ్యాడన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూడా… కేవీపీ, రోశయ్య, సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ల సలహాలు తీసుకున్నవారేనని, అందుకే సక్సెస్‌ అయ్యారని గుర్తుచేశారు.

కానీ పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఎవరైనా సలహాలు చెబితే ఈయనెవరు నాకు చెప్పడానికి అన్నట్లు చూసేవారన్నారు. ఇలా అహంకార మనస్థత్వం ఉంటే ఎలా రాజకీయాల్లో సక్సెస్‌ అవుతారని ప్రశ్నించారు. చాలా మంది సీనియర్‌ నాయకులు పార్టీలోకి వస్తానన్నా పవన్‌ మాత్రం ఇన్‌సెక్యూరిటిగా ఫీలయ్యారన్నారు. దీన్ని కప్పిపుచ్చుకోడానికి కొత్త రక్తంతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని అభిమానులలో, ప్రజల్లో భ్రమలు కల్పించారన్నారు. కొత్త వాళ్లతో కాకుండా తిక్కలోళ్ళతో ప్రజలముందుకు వచ్చాడన్నారు.

ఎదుటి వ్యక్తిని నమ్మే వ్యక్తిత్వం పవన్‌కు లేదన్నారు. ఆయనేదో కారణజన్ముడిగా…. ఆయన ముందు ఎవరూ ఎక్కువ కాదన్న మనస్థత్వం పవన్‌ది అన్నారు.

తాను చెప్పే విషయాలను వింటే పవన్‌ అభిమానులకు కాలుతుందన్నారు. అయినా తాను చెప్పదల్చుకున్నానన్నారు. ఫ్యాన్స్‌కు పవన్‌ అంటే అభిమానం ఉండాలి గానీ దురాభిమానం పనికిరాదన్నారు. ఒకసారి గతంలో పవన్‌ అమెరికాకు వెళ్లినప్పుడు అక్కడి అభిమానులు పవన్‌ను గొప్పగా ఊహించుకుని… ఎంతో ఆదరంగా ఆహ్వానించారని కానీ అతన్ని దగ్గరగా చూశాక ఇలాంటి వ్యక్తినా మేము అభిమానించింది అన్నారన్నారు. కనీసం పలకరించనూ లేదన్నారు. పలకరిస్తే దిక్కులు చూశారన్నారు. రూమ్‌లో పర్సనల్‌గా కలుద్దామంటే ఆయన వ్యక్తులు అవమానించారని చెప్పారన్నారు.

పార్టీ రిజిస్ట్రేషన్‌ నుంచి మారిశెట్టి రాఘవయ్య తన సొంత డబ్బులతో ఎన్నో కార్యక్రమాలు చేశారని…. ఆయనను కూడా పవన్‌ పట్టించుకోలేదన్నారు. చాలా మంది పెద్ద మనుషులను, ఒక ఐఏఎస్‌ను, అద్దెపల్లి శ్రీధర్‌ వంటి వ్యక్తులను పవన్‌ అవమానించాడన్నారు. నాదెండ్ల మనోహర్‌ వచ్చాకే పరిస్థితులు మారాయన్నారు.

మనోహర్‌ నచ్చితే పవన్‌ చంకలో పెట్టుకోవాలి కానీ…. ఇతరులను పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు విజయ్‌ బాబు.

డబ్బులు పంచలేదు, సారా పంచలేదని అందుకే ఓడిపోయామని చెప్పడం సరైన పద్దతి కాదన్నారు. అది ప్రజలను అవమానించడమేనన్నారు. ప్రజలు కేవలం డబ్బులు తీసుకునే ఓట్లు వెయ్యరని, విజ్ఞత కలవారని పవన్‌ అది తెలుసుకోవాలన్నారు. తాను చేసే ఈ వ్యాఖ్యలను మంచిగా స్వీకరిస్తే ఓకేనని… తన మీద కూడా కన్నెర్ర చేసినా పర్వాలేదన్నారు విజయ్‌ బాబు.