మమతను టార్గెట్ చేసిన బీజేపీ…. ఎమ్మెల్యేలకు గాలం

ఒక్క ఓటమి.. ఓడలను బండ్లు చేస్తుంది.. బండ్లను ఓడలు చేస్తుంది. ఇప్పుడు బెంగాల్ లో అలాంటి పరిస్థితే ఉంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ డీలా పడిపోయింది. కేంద్రంలో కుదిరితే ప్రధాని పదవిలో కూర్చుంటానని కలలు గన్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి.

మమత పార్టీ తృణమూల్ కు తక్కువ సీట్లు వచ్చాయి. ఇక 2014లో బీజేపీ 2 స్థానాల నుంచి 2019 ఎన్నికల్లో 18 సీట్లను సాధించింది.

పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి ఎడ్జ్ కనిపించగా.. బెంగాల్ లో తృణమూల్ పార్టీ ఎంతో అంచనావేసి దెబ్బతింది. ఇక ప్రధాని ప్రచారంలోనే మమత బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని.. 40మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని సవాల్ చేశారు. ఇప్పుడు తృణమూల్ ఓటమితో ఆపార్టీకి మూడినట్టే కనిపిస్తోంది.

తాజాగా మంగళవారం ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సస్పెండ్ అయిన శుబ్రాంగ్షు రాయ్ లు ఢిల్లీకి పయనమయ్యారు. బీజేపీ నేత ముకుల్ రాయ్ దగ్గరుండి ఈ ముగ్గురిని ఢిల్లీకి తీసుకెళ్లి అమిత్ షాను కలిపించేందుకు రెడీ అయ్యారు. వీరు ముగ్గురు బారక్ పూర్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు. అక్కడ బీజేపీ నేత అర్జున్ సింగ్ గెలిచారు.

ఈ ముగ్గురు బీజేపీలో చేరాలనుకోవడంపై టీఎంసీ సీరియస్ అయ్యింది. టీఎంసీ మంత్రి ఫిర్హాద్ హకీం వారితో సమావేశమయ్యారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడవద్దని హితవు పలికారు.

ఇలా బెంగాల్ లో ఓడిపోవడంతోనే తృణమూల్ పై వ్యతిరేకులు, పార్టీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలు బీజేపీ బాట పడుతున్నారు. త్వరలోనే చాలా మంది టీఎంసీ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకొని మమతను చావుదెబ్బ తీయడానికి అమిత్ షా రెడీ అయినట్లు తెలిసింది.