Telugu Global
NEWS

ప్రపంచకప్-ఇంగ్లండ్ 44 సంవత్సరాల కల

మూడోసారి ప్రపంచకప్ కు భారత్ గురి ఆరో టైటిలే లక్ష్యంగా ఆస్ట్రేలియా సౌతాఫ్రికా,న్యూజిలాంజ్ జట్లకు అందని ద్రాక్షలా ప్రపంచకప్  సత్తా చాటుకోడానికి శ్రీలంక, విండీస్, పాక్ తహతహ ఉనికి చాటుకొనే పనిలో బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ నాలుగున్నర దశాబ్దాల వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత భీకరమైన సమరానికి…అంతర్జాతీయ క్రికెట్లోని పది అత్యుత్తమజట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఆరువారాలపాటు జరిగే ఈ రౌండ్ రాబిన్ లీగ్ కమ్ సెమీఫైనల్స్ నాకౌట్  సమరంలో… ప్రతిజట్టూ… మిగిలిన తొమ్మిది […]

ప్రపంచకప్-ఇంగ్లండ్ 44 సంవత్సరాల కల
X
  • మూడోసారి ప్రపంచకప్ కు భారత్ గురి
  • ఆరో టైటిలే లక్ష్యంగా ఆస్ట్రేలియా
  • సౌతాఫ్రికా,న్యూజిలాంజ్ జట్లకు అందని ద్రాక్షలా ప్రపంచకప్
  • సత్తా చాటుకోడానికి శ్రీలంక, విండీస్, పాక్ తహతహ
  • ఉనికి చాటుకొనే పనిలో బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్

నాలుగున్నర దశాబ్దాల వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత భీకరమైన సమరానికి…అంతర్జాతీయ క్రికెట్లోని పది అత్యుత్తమజట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి.

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఆరువారాలపాటు జరిగే ఈ రౌండ్ రాబిన్ లీగ్ కమ్ సెమీఫైనల్స్ నాకౌట్ సమరంలో… ప్రతిజట్టూ… మిగిలిన తొమ్మిది ప్రత్యర్థి జట్లతో తలపడాల్సి ఉంది. 1992 ప్రపంచకప్ తర్వాత..ఈ ఫార్మాట్ ను మరోసారి ప్రవేశపెట్టారు.

రౌండ్ రాబిన్ లీగ్ దశలోని మొత్తం తొమ్మిది మ్యాచ్ ల్లో కనీసం ఆరు విజయాలు సాధించిన జట్లు సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరుకోగలుగుతాయి.

హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్…

వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఐదోసారి ఆతిథ్యమిస్తున్న ఇంగ్లండ్… ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా, హాట్ ఫేవరెట్ గా టైటిల్ వేటకు దిగుతోంది.

400కు పైగా స్కోర్లను అలవోకగా సాధించడం, చేధించడం ఓ అలవాటుగా మార్చుకొన్న ఇంగ్లండ్… ఇప్పుడుకాకపోతే మరెప్పుడూ కాదన్న నినాదంతో బరిలోకి దిగుతోంది.

వోయిన్ మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టులో జేసన్ రాయ్, బెయిర్ స్టో, జో రూట్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మోయిన్ అలీ, టామ్ కరెన్ లాంటి ప్రపంచ మేటి వన్డే స్టార్లున్నారు.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలతో పాటు… ఈ మధ్యకాలంలో అత్యధిక విజయాలు సాధించడంతో పాటు నిలకడగా రాణించిన జట్టుగా నిలిచింది.

87 వన్డేల్లో 57 విజయాలు

2015 ప్రపంచకప్ తర్వాత ఇంగ్లండ్ ఆడిన మొత్తం 87 వన్డేల్లో 57 గెలుపు, 23 ఓటమిల రికార్డుతో ఉంది. అంతేకాదు.. ఇంగ్లండ్ జట్టు ఏకంగా 87 వన్డేల్లో 21వేల 951 పరుగులు సాధించింది. ఇందులో 48 సెంచరీలు, 121 హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి. అంతేకాదు…ఇంగ్లండ్ బౌలర్లు 87 వన్డేల్లో 588 వికెట్లు పడగొట్టారు.

మూడుసార్లు రన్నరప్ ఇంగ్లండ్…

గత నాలుగున్నర దశాబ్దాల కాలంలో ప్రస్తుత ప్రపంచకప్ వరకూ ఐదుసార్లు ఆతిథ్యమిచ్చిన ఇంగ్లండ్ కు మూడుసార్లు ఫైనల్స్ చేరి… రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకొన్న రికార్డు ఉంది.

1979, 1987, 1992 ప్రపంచకప్ టోర్నీల ఫైనల్స్ చేరినా టైటిల్ సాధించలేకపోయింది. ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్ టోర్నీలలో కనీసం గ్రూప్ దశను అధిగమించలేని దుస్థితికి ఇంగ్లండ్ దిగజారిపోయింది.

అయితే…గత కొద్ది సంవత్సరాలకాలంలో.. ఇంగ్లండ్ అన్యూహ్యంగా పుంజుకొంది. అత్యుత్తమ జట్టుగా నిలిచింది. 44 సంవత్సరాల ప్రపంచకప్ కలను ప్రస్తుత టోర్నీలో నెరవేర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది.

తీన్మార్ కు టీమిండియా తహతహ….

వన్డే క్రికెట్లో … టాప్ ర్యాంకర్ ఇంగ్లండ్ తర్వాత అత్యుత్తమ జట్టు ఏదంటే… భారత్ అన్నమాటే గుర్తుకు వస్తుంది. పదునైన బౌలింగ్, పటిష్టమైన బ్యాటింగ్, పాదరసంలాంటి ఫీల్డింగ్ తో… విరాట్ కొహ్లీ నాయకత్వంలో టీమిండియా టైటిల్ వేటకు దిగుతోంది.

1983 ప్రపంచకప్ లో కపిల్ దేవ్, 2011 ప్రపంచకప్ లో ధోనీ నాయకత్వంలో విశ్వవిజేతగా నిలిచిన భారత్ కు 2003 ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన రికార్డు సైతం ఉంది.

86 వన్డేల్లో 56 విజయాలు..

గత ప్రపంచకప్ తర్వాత నుంచి నాలుగేళ్ల కాలంలో భారత్ ఆడిన మొత్తం 86 వన్డేల్లో 56 విజయాలు, 26 పరాజయాల రికార్డుతో ఉంది.

భారత్ జట్టు 86 మ్యాచ్ ల్లో 21 వేల 43 పరుగులు సాధించింది. ఇందులో 51శతకాలు, 103 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత బౌలర్లు 86 వన్డేల్లో 629 వికెట్లు పడగొట్టారు.

పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో భారత్ జూన్ 5న సౌతాఫ్రికాతో బ్రిస్టల్ వేదికగా జరిగే మ్యాచ్ లో తలపడనుంది. తొమ్మిదిరౌండ్ల రౌండ్ రాబిన్ లీగ్ నుంచి భారత్ సెమీస్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

పడిలేచిన కెరటం ఆస్ట్రేలియా..

వన్డే క్రికెట్ కు మరోపేరు ఆస్ట్రేలియా. అంతేకాదు.. ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఏకైకజట్టు కంగారూలు మాత్రమే. ఇప్పుడు ఆరో ప్రపంచకప్ టైటిల్ సాధించడానికి ఆస్ట్రేలియా ఉరకలేస్తోంది.

ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని కంగారూ టీమ్ లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ , మైకేల్ స్టార్క్ , ఆడం జంపా, నేథన్ లయన్, జోష్ హెజిల్ వుడ్, గ్లెన్ మాక్స్ వెల్, మార్కుస్ స్టోయినిస్ లాంటి స్పెషలిస్ట్ ఆటగాళ్లున్నారు.

రౌండ్ రాబిన్ లీగ్ నుంచి ఆసీస్ సెమీస్ చేరుకోడమే కాదు…అదృష్టం కలసివస్తే విశ్వవిజేతగా నిలిచినా ఆశ్చర్యం లేదు.
గత నాలుగేళ్ల కాలంలో కంగారూ టీమ్ ఆడిన 76 వన్డేల్లో 37 విజయాలు, 36 పరాజయాల రికార్డుతో ఉంది.

భారతజట్టును భారతగడ్డపై చిత్తు చేసి సిరీస్ నెగ్గిన ఆత్మవిశ్వాసంతో కంగారూ టీమ్ టైటిల్ వేటకు దిగుతోంది.

సఫారీల టైటిల్ కలలు..

అన్నీ ఉన్నా అల్లుడినోట్ల శని అన్న సామెత..అతికినట్లు సరిపోయే ఏకైక జట్టు సౌతాఫ్రికా. విశ్వవిజేతగా నిలవటానికి తగిన హంగులన్నీ ఉన్నా .. సఫారీజట్టు మాత్రం ప్రపంచకప్ లో తేలిపోతూ వస్తోంది.

ఫాబ్ డూప్లెసీ నాయకత్వంలోని సౌతాఫ్రికా జట్టులో ప్రపంచ మేటి బౌలర్లు కిర్గిసో రబాడా, మ్యాజిక్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్, సూపర్ హిట్టర్ క్వింటన్ డీ కాక్ లాంటి అరివీర భయంకర క్రికెటర్లున్నారు.

2015 ప్రపంచకప్ తర్వాత నుంచి సౌతాఫ్రికా ఆడిన 74వన్డేల్లో 47 నెగ్గి, 26 మ్యాచ్ ల్లో ఓటమి చవిచూసింది.

అంచనాలకు అందని న్యూజిలాండ్….

ప్రపంచకప్ టోర్నీల్లో సంచలన విజయాలు సాధిస్తున్నా…నిలకడగా రాణిస్తున్నా…రన్నరప్ స్థానాలకే పరిమితమవుతున్న న్యూజిలాండ్.. టైటిల్ సాధించాలన్న లక్ష్యంతో …కేన్ విలియమ్స్ సన్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది.

పలువురు ప్రతిభావంతులైన హిట్టర్లు, బౌలర్లున్న కివీ జట్టు ..తొమ్మిదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో సంచలనాలు సృష్టించినా ఆశ్చర్యం లేదు. గత ప్రపంచకప్ నుంచి కివీ జట్టు ఆడిన 76వన్డేల్లో 43 గెలుపు, 30 ఓటమి రికార్డుతో ఉంది.

వివాదాల పాకిస్థాన్…

ఐసీసీ మినీ ప్రపంచకప్ విజేత పాకిస్థాన్… రెండోసారి ప్రపంచకప్ టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఎప్పుడు…ఏ స్థాయిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుందో తెలియని పాక్ జట్టు… వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సర్ ఫ్రాజ్ ఆహ్మద్ నాయకత్వంలో టైటిల్ వేటకు దిగుతోంది.

1992లో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో ప్రపంచకప్ సాధించిన పాక్ జట్టు ఆ తర్వాత మరోసారి రన్నరప్ గానే మిగిలింది.

గత ప్రపంచకప్ తర్వాత నుంచి ఇంగ్లండ్ తో ముగిసిన పాంచ్ పటాకా సన్నాహక సిరీస్ వరకూ… 79 వన్డేల్లో తలపడిన పాక్ జట్టు 35 గెలుపు, 41 ఓటమి రికార్డుతో ఉంది.

పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ నుంచి సెమీస్ చేరుకోగలనన్న ధీమా పాక్ జట్టులో కనిపిస్తోంది.

ఇటు శ్రీలంక- అటు విండీస్…

ప్రపంచకప్ మాజీ విజేతలు వెస్టిండీస్, శ్రీలంక జట్లు ప్రస్తుత ప్రపంచకప్ ద్వారా తమ సత్తా చాటుకోడానికి ఎదురుచూస్తున్నాయి.
ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ నాయకత్వంలోని కరీబియన్ జట్టులో క్రిస్ గేల్, డ్వయన్ బ్రావో, డారెన్ బ్రావో, కిరాన్ పోలార్డ్,
సునీల్ నరైన్, యాండ్రీ రసెల్ లాంటి భీకర ఆటగాళ్లున్నారు.

1975, 1978 ప్రపంచకప్ టోర్నీల్లో విజేతగా, 1983 ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన విండీస్ జట్టు..2015 ప్రపంచకప్ తర్వాత నుంచి ఆడిన మ్యాచ్ ల్లో రికార్డు అంతంత మాత్రంగానే ఉంది.

వెస్టిండీస్ 67 వన్డేల్లో 19 విజయాలు, 42 పరాజయాల రికార్డుతో నిలిచింది.

ఇక..మాజీ చాంపియన్ శ్రీలంక పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. కరుణరత్నే నాయకత్వం లోని శ్రీలంక జట్టులో మాజీ కెప్టెన్లు తిస్సార పెరెరా , ఏంజెలో మాథ్యూస్, లాసిత్ మలింగ లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారు. రౌండ్ రాబిన్ లీగ్ దశ నుంచి సెమీస్ చేరడం శ్రీలంకకు పెద్ద సవాలే. గత నాలుగేళ్ల కాలంలో ఆడిన 84 వన్డేల్లో 23 గెలుపు, 55 ఓటమి రికార్డుతో ఉంది.

ఉనికిచాటుకొనే పనిలో బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్…

వన్డే క్రికెట్లో తమదైనరోజున..ఎలాంటి ప్రత్యర్థికైనా ముచ్చమటలు పట్టించే సత్తా చిచ్చరపిడుగులు బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్ జట్లకు ఉంది. ప్రస్తుత ప్రపంచకప్ ద్వారా తమ ఉనికిని చాటుకోడానికి ఈ రెండుజట్లు తహతహలాడుతున్నాయి.

2015 ప్రపంచకప్ తర్వాత నుంచి బంగ్లాజట్టు ఆడిన 62 వన్డేల్లో 34 గెలుపు, 25 ఓటమి రికార్డుతో ఉంది. వెటరన్ ఫాస్ట్ బౌలర్ ముషరఫే మొర్తాజా నాయకత్వంలోని బంగ్లాజట్టులో ముష్ ఫికర్ రహీం, మహ్మదుల్లా, లిట్టన్ దాస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షకీబుల్ హసన్, సౌమ్య సర్కార్, తమీమ్ ఇక్బాల్ లాంటి ఆటగాళ్లున్నారు.

వన్డే క్రికెట్ పసికూన అప్ఘనిస్థాన్ గుల్బుదీన్ నైబ్ నాయకత్వంలో రషీద్ ఖాన్ లాంటి ప్రపంచ మేటి బౌలర్ తోపాటు..పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కూడిన జట్టుతో సమరానికి సిద్ధమయ్యింది. ప్రపంచ మేటి జట్లను ముప్పతిప్పలు పెట్టగలనన్న ధీమాతో ఉంది.

గత..నాలుగేళ్ల కాలంలో అప్ఘనిస్థాన్ జట్టు 61 వన్డేల్లో 33 గెలుపు, 24 పరాజయాల రికార్డుతో నిలిచింది.

మొత్తం 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ నుంచి నాలుగుజట్ల సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు…ఏ నాలుగు జట్లు చేరుతాయన్నదే ఇక్కడి అసలు పాయింట్.

First Published:  28 May 2019 7:02 PM GMT
Next Story