అధిక ధాన్యం నిల్వలు.. 1.2 లక్షల కోట్లు నష్టపోయిన ఫుడ్ కార్పొరేషన్

ఒకవైపు దేశంలో ఆకలి చావులు ఇంకా కనపడుతూనే ఉన్నాయి. మరోవైపు భారీ ప్రాజెక్టుల నిధుల కోసం అంతర్జాతీయ బ్యాంకుల వైపు చూడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) అధిక మొత్తంలో ధాన్యాలను నిల్వ చేసి ప్రభుత్వానికి 1.20 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొని వచ్చింది.

సాధారణంగా ప్రతీ ఏడాది నిల్వ చేసే దాని కంటే 2018-19లో 1.80 లక్షల కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని అధికంగా నిల్వచేసింది. దీంతో ఇప్పుడు ఈ అధిక నిల్వలను అమ్మాలనుకుంటే కేవలం 30వేల కోట్ల రూపాయలు మాత్రమే వస్తుండటంతో దాదాపు 1.20 లక్షల కోట్లు వృధా అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నష్టపోయిన డబ్బుతో 4వేల కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల జాతీయ రహదారిని నిర్మించవచ్చని అంచనా.

దేశంలో ఫుడ్ సబ్సిడీ పెరిగిపోవడంతో వరుసగా మూడో ఏడాది కూడా ఎఫ్‌సీఐ ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. ప్రతీ ఏడాది దాదాపు 2 లక్షల కోట్ల మేర ఈ భారం ఉంటోంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఈ ఏడాది ఏప్రిల్‌లో జాతీయ చిన్నమొత్తాల పొదుపు నుంచి ఎఫ్‌సీఐ 60వేల కోట్లను అప్పుగా తీసుకుంది. ఒక వైపు ధాన్యం నిల్వలు పెరిగిపోతుంటే.. మరో వైపు అప్పుల భారం కూడా పెరుగుతోంది.

ఇప్పటికే ఉన్న నిల్వలను బహిరంగ మార్కెట్‌లో అమ్మడం ద్వారా అప్పులు తగ్గించుకునే వీలుంది. కాని 1.80 లక్షల కోట్ల విలువైన ధాన్యాన్ని కేవలం 30 వేల కోట్లకే అమ్ముకోవాల్సిన పరిస్థితి.

ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి సెంట్రల్ పూల్‌లో 39.83 మిలియన్ టన్నుల బియ్యం, 17 మిలియన్ టన్నుల గోధుమను సేకరించారు. ఇది సాధారణ నిల్వ కంటే 13.58 (బియ్యం), 9.53 (గోధుమలు) అధికం.మరి కొద్ది రోజుల్లో రబీ పంట ధాన్యాన్ని సేకరించవలసిన సమయంలో ఇలా అధికమొత్తంలో ఉన్న నిల్వలు ఎఫ్‌సీఐని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.