Telugu Global
NEWS

అదిగో ప్రపంచకప్...ఎవరిదో లక్

మూడో ప్రపంచకప్ టైటిల్ కు భారత్ గురి మే 30 నుంచి జులై 14 వరకూ హంగామా హాట్ ఫేవరెట్లుగా ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్లో మరో ప్రపంచకప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకూ జరిగే సమరానికి…రెండుసార్లు విజేత, ప్రపంచ రెండో ర్యాంకర్ భారత్ సిద్ధమయ్యింది. ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో మరో ప్రపంచకప్ యుద్ధానికి అంతర్జాతీయ క్రికెట్లోని అగ్రశ్రేణి […]

అదిగో ప్రపంచకప్...ఎవరిదో లక్
X
  • మూడో ప్రపంచకప్ టైటిల్ కు భారత్ గురి
  • మే 30 నుంచి జులై 14 వరకూ హంగామా
  • హాట్ ఫేవరెట్లుగా ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా

పరిమిత ఓవర్ల క్రికెట్లో మరో ప్రపంచకప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకూ జరిగే సమరానికి…రెండుసార్లు విజేత, ప్రపంచ రెండో ర్యాంకర్ భారత్ సిద్ధమయ్యింది.

ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో మరో ప్రపంచకప్ యుద్ధానికి అంతర్జాతీయ క్రికెట్లోని అగ్రశ్రేణి జట్లన్నీ గెలుపుగుర్రాలతో సిద్ధమయ్యాయి. ఇంగ్లండ్, వేల్స్ దేశాలలోని 11 వేదికల్లో మే నెల 30 నుంచి జులై 14 వరకూ.. మొత్తం 48 మ్యాచ్ లుగా ప్రపంచకప్ ను నిర్వహించడానికి ఐసీసీ విస్త్రృతస్థాయిలో ఏర్పాట్లు చేసింది.

రెండు దశాబ్దాల తర్వాత…

రెండుదశాబ్దాల విరామం తర్వాత ఇంగ్లండ్ గడ్డపై జరగనున్న ఈ పోటీలను రౌండ్ రాబిన్ లీగ్ కమ్ సెమీఫైనల్స్ నాకౌట్ గా నిర్వహించనున్నారు. ప్రపంచక్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జులై 14న టైటిల్ సమరం జరగనుంది.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ విజేత ఆస్ట్రేలియా, రెండుసార్లు విన్నర్ భారత్ , ప్రపంచ నంబర్ వన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు టైటిల్ వేటకు దిగుతున్నాయి.

సమతూకంతో టీమిండియా…

ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ నాయకత్వంలోని 15 మంది సభ్యుల భారతజట్టు అత్యంత సమతూకంతో ఉంది. అంబటి రాయుడి లాంటి అనుభవం ఉన్న, నిలకడగా రాణించిన ఆటగాడిని ఆఖరి నిముషంలో పక్కనపెట్టడం, యువకిశోరం రిషభ్ పంత్ ను ఎంపిక చేయకపోడం విమర్శలకు దారితీసినా… జట్టు కూర్పు సమతూకంతో ఉందని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

కుదురైన బ్యాటింగ్ ….

డాషింగ్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, వన్ డౌన్ స్థానంలో కెప్టెన్ విరాట్ కొహ్లీ, రెండో డౌన్లో రాహుల్, మిడిలార్డర్లో కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోనీ… లోయర్ మిడిలార్డర్లో రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, ఆల్ రౌండర్లు హార్ధిక్ పాండ్యా, విజయ్ శంకర్ లతో భారత బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. తమదైన రోజున 400కు పైగా భారీ స్కోరు సాధించే సత్తా..విరాట్ సేనకు ఉంది.

పదునైన బౌలింగ్…..

భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రా, విజయ్ శంకర్, హార్థిక్ పాండ్యాలతో కూడిన పేస్ బౌలింగ్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ లతో కూడిన స్పిన్ ఎటాక్ తో భారత బౌలింగ్ భీకరంగా కనిపిస్తోంది.

కళ్లు చెదిరే ఫీల్డింగ్….

ఆధునిక క్రికెట్లో ఫీల్డింగ్ కు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఒక్క పరుగును కాపాడుకోగలిగితే ఒక్క పరుగు సాధించినట్లుగానే వివిధ దేశాల జట్లు భావిస్తున్నాయి. కేవలం ఫీల్డింగ్ సత్తాతోనే మ్యాచ్ ఫలితం తారుమారుకావడం వన్డే క్రికెట్లో సాధారణ విషయంగా మారింది.

ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొనే భారత జట్టు యాజమాన్యం చురుకైన ఫీల్డింగ్ కు పెద్దపీట వేసింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, రాహుల్, రోహిత్ శర్మ, విజయ్ శంకర్ లాంటి మెరుపు ఫీల్డర్లు భారతజట్టులో ఉన్నారు.

మొత్తం మీద… క్రికెట్లోని మూడు విభాగాలలోనూ విరాట్ సేన అత్యంత సమతూకంతో ఉందని జట్టు కూర్పే చెబుతోంది.

ఇంగ్లండ్ వికెట్లు, వాతావరణమే కీలకం!

ప్రపంచకప్ జరిగే జూన్, జులై మాసాలలో ఇంగ్లండ్ వాతావరణం, అక్కడి పిచ్ లు ఎలా ఉంటాయన్న అంశంపైనే భారతజట్టు జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. లార్డ్స్ నుంచి బ్రిస్టల్ వరకూ, నాటింగ్ హామ్ నుంచి బర్మింగ్ హామ్ వరకూ ఉన్న ఇంగ్లీష్ వికెట్లు పేస్ లేదా స్పిన్ బౌలింగ్ కు అనుకూలించినా…పరిస్థితులకు అనుగుణంగా రాణించగల బౌలింగ్ బలం భారత్ కు ఉంది.

కప్పు కొడితే 28 కోట్ల ప్రైజ్ మనీ…

ఐసీసీ వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక మొత్తంలో ప్రైజ్ మనీ ఇవ్వటానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఏర్పాట్లు చేసింది.
10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో నెగ్గిన జట్టుకు మ్యాచ్ కు 28 లక్షల రూపాయల చొప్పున నజరానాగా ఇస్తారు.

ఇక … సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లకూ.. 5 కోట్ల 60 లక్షల రూపాయల చొప్పున అందచేస్తారు.

ఫైనల్స్ లో విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ ప్రపంచకప్ తో పాటు 28 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కుతుంది. ఫైనల్లో ఓడిన జట్టుకు మాత్రం 14 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. లక్షల రూపాయల చెక్ అందుకోనున్నాయి.

క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ టోర్నీగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ చేరింది. మొత్తం 70 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కోసమే ఐసీసీ కేటాయించింది.

జూన్ 5న భారత ప్రారంభమ్యాచ్…

జూన్ 5న సౌతాఫ్రికా, జూన్ 9న ఆస్ట్రేలియా, జూన్ 13న న్యూజిలాండ్, జూన్ 16న పాకిస్థాన్, జూన్ 22న అప్ఘనిస్థాన్, జూన్ 27న వెస్టిండీస్, జూన్ 30న ఇంగ్లండ్ జట్లతో భారత్ ఢీ కొంటుంది. అంతేకాదు…జులై 2న బంగ్లాదేశ్, జులై 6న శ్రీలంక జట్లతో పోటీపడాల్సి ఉంది.

రౌండ్ రాబిన్ లీగ్ లో మొదటి నాలుగుస్థానాలు సాధించిన జట్లకే…సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో తలపడే అవకాశం ఉంటుంది.
జులై 9న తొలి సెమీ ఫైనల్స్, 11న రెండో సెమీఫైనల్స్, జులై 14న క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరిగే టైటిల్ సమరంతో… 2019 ప్రపంచకప్ కు తెరపడనుంది.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో 1983, 2011టోర్నీలు నెగ్గిన ఘనత భారత్ కు ఉంది. విరాట్ కొహ్లీ నాయకత్వంలో…టీమిండియా ప్రపంచకప్ తో తిరిగిరావాలని కోరుకొందాం…

First Published:  29 May 2019 8:45 PM GMT
Next Story