తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కడు….

మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కరికి అవకాశం లభించింది. తెలంగాణలోని సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన జి. కిషన్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఏపీలో బీజేపీ కి అంత సీన్ లేకపోయినా, తెలంగాణ నుంచి అనూహ్యంగా నలుగురు ఎంపీలు బీజేపీ నుంచి గెలుపొందారు.

ఇందులో కనీసం ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంటుందని, అందులో ఒకరు కేబినెట్ మంత్రి కూడా ఉండవచ్చని భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మోదీ తెలుగు రాష్ట్రాలకు ఒకేఒక సహాయ మంత్రి పదవితో సరిపెట్టారు. కనీసం స్వతంత్ర హోదా కూడా లభించలేదు. గతంలో కూడా ఇదే స్థానం నుంచి విజయం సాధించిన బండారు దత్తాత్రేయ కూడా సహాయ మంత్రిగానే ఉన్నారు.

ఆయనను కూడా అర్ధంతరంగా మంత్రి పదవి నుంచి తప్పించారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు కిషన్ రెడ్డికి మంత్రి పదవి లభించడంతో తెలంగాణలోని బీజేపీ శ్రేణులు సంబరాలలో మునిగిపోయాయి. కిషన్ రెడ్డి మూడున్నర దశాబ్దాలుగా పార్టీకి అందించిన సేవలకు గుర్తింపు లభించిందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆ పార్టీ నేతలు కూడా దాదాపు ఫుల్ జోష్ లో ఉన్నారని అంటున్నారు. శాసనసభ ఎన్నికలలో ఘొర పరాభవం తరువాత నలుగురు ఎంపీలు విజయం సాధించడం, అందులో ఒకరు మంత్రి కూడా కావడం వారిలో ఉత్పాహాన్ని నింపిందని చెబుతున్నారు.

ఈ పరిణామాలు భవిష్యత్తు లో తెలంగాణలో పార్టీ ఎదుగుదలకు దోహదం చేసే అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారని అంటున్నారు. మరోవైపు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసేటపుడు కొన్ని పదనిసలు చోటు చేసుకున్నాయి. పదవీ ప్రమాణ స్వీకారానికి తలపాగా చుట్టుకుని వచ్చిన కిషన్ రెడ్డి హిందీలో ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా కొంత తడబడ్డారు. దీంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొన్ని పదాలను సరిదిద్ది కిషన్ రెడ్డి చేత మళ్లీ చదివించారు. ఏదేమైనా యువకుడైన కిషన్ రెడ్డి తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆయనకూ మేలు కలుగుతుందని, పార్టీకీ ప్రయోజనకరంగా ఉంటుందనీ, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికీ దోహదపడినవారవుతారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలిక మరి ఏం జరుగుతుందో?!