Telugu Global
Cinema & Entertainment

'ఎన్ జీ కే' సినిమా రివ్యూ

రివ్యూ: ఎన్ జీ కే మూవీ రేటింగ్‌: 1.5/5 తారాగణం: సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నిళల్‌గల్‌ రవి, ఉమా పద్మనాభన్‌ తదితరులు సంగీతం: యువన్‌ శంకర్‌రాజా నిర్మాత: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు  దర్శకత్వం: శ్రీరాఘవ తెలియనిది ట్రై చేయకూడదు, తెలిసింది ఫ్రీగా చేయకూడదనేది పాపులర్ డైలాగ్. ఈ చిన్న లాజిక్ ను సెల్వరాఘవన్ (శ్రీరాఘవ) మిస్ అయ్యాడు. తనకు బాగా పట్టున్న ప్రేమకథల జానర్ ను వదిలేసి, పొలిటికల్ నేపథ్యాన్ని ఎంచుకోవడమే శ్రీరాఘవ చేసిన తప్పు. ఆ తప్పు ఎన్ జీ కే […]

ఎన్ జీ కే సినిమా రివ్యూ
X

రివ్యూ: ఎన్ జీ కే మూవీ
రేటింగ్‌: 1.5/5
తారాగణం: సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నిళల్‌గల్‌ రవి, ఉమా పద్మనాభన్‌ తదితరులు
సంగీతం: యువన్‌ శంకర్‌రాజా
నిర్మాత: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు
దర్శకత్వం: శ్రీరాఘవ

తెలియనిది ట్రై చేయకూడదు, తెలిసింది ఫ్రీగా చేయకూడదనేది పాపులర్ డైలాగ్. ఈ చిన్న లాజిక్ ను సెల్వరాఘవన్ (శ్రీరాఘవ) మిస్ అయ్యాడు. తనకు బాగా పట్టున్న ప్రేమకథల జానర్ ను వదిలేసి, పొలిటికల్ నేపథ్యాన్ని ఎంచుకోవడమే శ్రీరాఘవ చేసిన తప్పు. ఆ తప్పు ఎన్ జీ కే సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. 7/జి బృందావన కాలనీ, ఆడవారిమాటలకు అర్థాలే వేరులే లాంటి మనసుకు హత్తుకునే సినిమాల్ని తీసిన ఆ శ్రీరాఘవనే, ఈ ఎన్ జీ కేను తీశాడంటే నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది.

నంద గోపాల కృష్ణ.. షార్ట్ కట్ లో ఎన్ జీ కే. ఎమ్ టెక్ చేసి పెద్ద ఉద్యోగాన్ని వదిలి మరీ సేంద్రియ వ్యవసాయం వైపు వస్తాడు. తన ఊరిలోనే వ్యవసాయం చేసుకుంటూ, తోటివారికి సాయపడుతూ, భార్య గీత (సాయిపల్లవి), తల్లిదండ్రులతో హ్యాపీగా కాలం గడిపేస్తుంటాడు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. గ్రామస్తులంతా సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లడంతో పురుగు మందుల అమ్మకాలు తగ్గిపోతాయి. వ్యాపారులంతా కలిసి గ్రామస్తులపై దాడులకు దిగుతారు.

ఆ సమయంలో ఏం చేయాలో తెలియక స్థానిక ఎమ్మెల్యే సహకారం తీసుకొని, ఆ పార్టీకి మద్దతిస్తూ ఓ సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తాడు గోపాలం. కానీ కుళ్లు రాజకీయాల్లో ఇమడలేకపోతాడు. ఓవైపు అతడిపై దాడులు కూడా పెరిగిపోతుంటాయి. అప్పుడు గోపాలం ఏం చేశాడు? ఎలా మారాడు? నియోజకవర్గాన్ని కాపాడుకోవడంతో పాటు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగాడు అనేది ఎన్ జీ కే స్టోరీ.

ఇలా చెప్పుకుంటే స్టోరీ వినడానికి చాలా బాగుంది కదా…. కానీ తెరపై చూడ్డానికి మాత్రం నందగోపాల్ పనికిరాడు. దర్శకుడు శ్రీరాఘవ దీన్ని అలా తయారుచేశాడు. తనకు పొలిటికల్ సబ్జెక్ట్ పై పట్టు లేదన్న విషయాన్ని ఈ సినిమా ద్వారా బలంగా నిరూపించుకున్నాడు శ్రీరాఘవ. అసలే పాత చింతకాయపచ్చడి లాంటి సినిమా. దానికి తోడు పేలవమైన సన్నివేశాలు. ఇక చెప్పేదేముంది.. థియేటర్లలో ఎన్ జీ కే చుక్కలు చూపించింది. ఇంటర్వెల్ వచ్చేసరికే 3 గంటల సినిమా చూసిన అనుభూతి తెప్పిస్తుంది ఈ సినిమా. అక్కడితో ఆగితే అది ఎన్ జీ కే ఎందుకవుతుంది. ఇంటర్వెల్ తర్వాత నరకం పార్ట్-2 స్టార్ట్ అవుతుంది. ఇలా ఎన్ జీ కే సినిమాని తన కెరీర్ లోనే వరస్ట్ సినిమాగా తీర్చిదిద్దాడు దర్శకుడు శ్రీరాఘవ.

పాపం దర్శకుడిపై నమ్మకంతో హీరో కళ్లుమూసుకొని నటించాడు. డైరక్టర్ చెప్పింది చెప్పినట్టు చేశాడు. కానీ ఏం లాభం, సన్నివేశంలో బలం లేనప్పుడు హీరో అయినా ఏం చేయగలడు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సూర్య కూడా చాలా చోట్ల చేతులెత్తేశాడంటే ఎన్ జీ కే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు.

ఈ సినిమాను పైకి లేపడానికి సూర్య విశ్వప్రయత్నం చేస్తున్నాడనే విషయం మనకు అర్థమౌతూనే ఉంటుంది. కానీ ఆ అవకాశం మనకు ఇవ్వలేదు దర్శకుడు. ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఉన్నారు ఈ సినిమాలో. వాళ్లను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేక పోయాడు దర్శకుడు.

గోపాలం భార్య గీత పాత్రలో సాయిపల్లవి ప్రారంభంలో బాగానే కనిపిస్తుంది. కానీ భర్తను అనుమానించే షేడ్ వచ్చేసరికి సైకోలా మారిపోవుతుంది. మంచి నటిగా గుర్తింపుతెచ్చుకున్న సాయిపల్లవితో ఓవరాక్షన్ చేయించిన ఘనత శ్రీరాఘవకే దక్కుతుంది. మరో హీరోయిన్ రకుల్ ఉన్నంతలో డీసెంట్ గా నటించినప్పటికీ ఆమె క్యారెక్టర్ ను దర్శకుడు బాగా రాయలేదు. దీంతో సినిమాలో ఆమె కూడా తేలిపోయింది.

కథ-స్క్రీన్ ప్లే లేకుండా, దారితెన్నూ తెలియకుండా వెళ్తున్న ఈ సినిమాలో పాటలతోనైనా ఉపశమనం పొందుదామంటే ఆ ఆనందం కూడా దక్కకుండా చేశాడు యువన్ శంకర్ రాజా. శ్రీరాఘవ సినిమాలకు ప్రత్యేకంగా బాణీలు అందించే ఈ మ్యూజిక్ డైరక్టర్, ఎన్ జీ కే విషయంలో నాసిరకం సంగీతం అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాడు.

ఇక ఎడిటర్ ది మరో అరాచకం. అతడి చేతులు పూర్తిగా కట్టేసినట్టున్నారు. కొన్ని సన్నివేశాల్ని ట్రిమ్ కూడా చేయకుండా అలానే వదిలేశాడు. అప్పుడే ఎడిటింగ్ క్లాసులు నేర్చుకుంటున్న కుర్రాడికి ఈ సినిమా ఇస్తే, స్పాట్ లో 30-40 నిమిషాల సన్నివేశాల్ని అలా కట్ చేసి పడేస్తాడు. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్, డ్రీమ్ వారియర్స్ సంస్థలు మాత్రం ఖర్చుకు అస్సలు వెనకాడలేదు.

ఇలా టెక్నీషియన్స్ నుంచి కూడా సహకారం అందకపోవడంతో ఎన్ జీ కే సినిమా ఏ అంశంలోనూ మెప్పించదు. సినిమా ఆసాంతం చిత్రహింసకు గురిచేస్తుంది. అసలు సూర్య లాంటి నటుడు ఏం చూసి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో అర్థంకాదు. సూర్య-శ్రీరాఘవ కాంబోలో వచ్చిన మొదటి సినిమా ఇది. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. దానికి తోడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అనేసరికి అంచనాలు రెట్టింపు అయ్యాయి. కానీ “అంచనాలు” అనే పదం దరిదాపులకు కూడా రాలేకపోయింది ఎన్ జీ కే.

సూర్య ఫ్యాన్స్ ఎలాగోలా ఇబ్బంది పడి ఈ సినిమాను 148 నిమిషాల పాటు భరిస్తారేమో కానీ, సామాన్య ప్రేక్షకుడు మాత్రం ఈ గోపాలంను భరించలేడు.

చివరగా….

నందగోపాల కృష్ణ తను కష్టపడ్డమే కాకుండా, ప్రేక్షకుల్ని కూడా చాలా కష్టపెడతాడు.

First Published:  31 May 2019 7:29 AM GMT
Next Story