ప్రపంచకప్ లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రికార్డులు

  • 9 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో సచిన్ టాప్ 
  • సచిన్ తర్వాతి స్థానంలో గ్లెన్ మెక్ గ్రాత్

ప్రపంచకప్ లో పాల్గొంటేచాలు తమ జన్మధన్యమైనట్లనని క్రికెటర్లు భావిస్తూ ఉంటారు. అయితే ..ప్రపంచకప్ లో పాల్గొనటమే కాదు…. అత్యుత్తమంగా రాణించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకొంటే… ఏ ఆటగాడికైనా అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.

1975 నుంచి 2015 ప్రపంచకప్ వరకూ మొత్తం 11 టోర్నీల్లో..అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు నెగ్గిన ఘనత…భారత క్రికెటర్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు మాత్రమే దక్కుతుంది.

సచినే టాప్….

1992 బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచకప్ నుంచి 2011 ప్రపంచకప్ వరకూ ..ఆరుటోర్నీలలో పాల్గొన్న ఏకైక ఆటగాడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ మాత్రమే. మిడిలార్డర్ నుంచి డాషింగ్ ఓపెనర్ స్థాయికి ఎదిగిన సచిన్…ఏకంగా తొమ్మిదిసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకొన్నాడు.

1992 ప్రపంచకప్ లో 2 అవార్డులు, 1996 ప్రపంచకప్ లో 2 అవార్డులు, 2003 ప్రపంచకప్ లో 3 అవార్డులు సాధించాడు.
సచిన్ 2003 ప్రపంచకప్ లో భాగంగా ఆడిన మొత్తం 11 మ్యాచ్ ల్లో 673 పరుగులతో విశ్వరూపమే ప్రదర్శించాడు.

తన కెరియర్ లో ఆడిన ఆఖరి ప్రపంచకప్ లో సైతం మాస్టర్ ఓ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు. రెండో స్థానంలో గ్లెన్ మెక్ గ్రాత్ సచిన్ తర్వాత అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకొన్న ఘనత ఆస్ట్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ కే దక్కుతుంది. మెక్ గ్రాత్ ఏకంగా ఆరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించాడు.

ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకొన్న ఏకైక బౌలర్ మెక్ గ్రాత్ మాత్రమే.

ఐదుగురికి ఐదేసి అవార్డులు…

అంతేకాదు…వివిధ దేశాలకు చెందిన మరో ఐదుగురు క్రికెటర్లు ఐదేసిసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకొన్నారు.

వీరిలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్, ఆల్ రౌండర్ లాన్స్ క్లూజ్నర్, శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య, ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ గ్రాహం గూచ్, కరీబియన్ థండర్, విండీస్ మాజీ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్ ఉన్నారు.