సిక్సర్లు బాదుడులో గేల్ ప్రపంచకప్ రికార్డు

  • ప్రారంభమ్యాచ్ లో పాక్ పై విండీస్ అలవోక విజయం
  • 40 సిక్సర్లతో కరీబియన్ ఓపెనర్ టాప్ 
  • రెండు, మూడు స్థానాల్లో డివిలియర్స్, పాంటింగ్

వెస్టిండీస్ సునామీ ఓపెనర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 2019 ప్రపంచకప్ రెండోరోజు జరిగిన మ్యాచ్ లోనే సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

నాటింగ్ హామ్ వేదికగా మాజీ చాంపియన్ పాకిస్థాన్ తో జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో తనజట్టుకు 7 వికెట్ల విజయం అందించడంలో ప్రధానపాత్ర వహించాడు. అంతేకాదు…సిక్సర్ల మోత మోగించడంలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.

పాక్ టపటపా….

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న విండీస్ ప్రత్యర్థి పాక్ ను 105 పరుగులకే కుప్పకూల్చింది. ఫాస్ట్ బౌలర్లు ఓషియన్ థామస్ 4 వికెట్లు, యాండ్రీ రసెల్ 2 వికెట్లు, కోట్రిల్ 1 వికెట్ పడగొట్టారు.

106 స్వల్పలక్ష్యంతో చేజింగ్ కు దిగిన విండీస్ కు గేల్ మెరుపు హాఫ్ సెంచరీతో విజయం ఖాయం చేశాడు. గేల్ హాఫ్ సెంచరీలో 6 బౌండ్రీలు, 3 సిక్సర్లు ఉన్నాయి.

కేవలం 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే నష్టపోయి…కరీబియన్ టీమ్ విజేతగా నిలిచింది. యువఫాస్ట్ బౌలర్ థామస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఏబీ రికార్డును అధిగమించిన గేల్…

తన కెరియర్ లో ఆఖరి ప్రపంచకప్ ఆడుతున్న 39 ఏళ్ల క్రిస్ గేల్ 34 బాల్స్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే బాదిన సిక్సర్ తో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేయగలిగాడు. ఇప్పటి వరకూ సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలియర్స్ పేరుతో ఉన్న అత్యధిక ప్రపంచకప్ సిక్సర్ల రికార్డును తెరమరుగు చేయగలిగాడు.

డివిలియర్స్ 23 మ్యాచ్ ల్లో 39 సిక్సర్లు బాదితే…గేల్ 27 మ్యాచ్ ల్లోనే 40 సిక్సర్లు బాదడం ద్వారా…ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు సాధించిన మొనగాడిగా నిలిచాడు.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 46 మ్యాచ్ ల్లో 36 సిక్సర్లు సాధించడం ద్వారా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.