సైలెంట్ అయిన సురేష్ బాబు

ఫలక్ నుమా దాస్ సినిమాకు అన్నీతానై వ్యవహరించారు సురేష్ బాబు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడంతో పాటు ప్రమోషన్ కు కూడా కొంత బడ్జెట్ కేటాయించాడు. అంతెందుకు, ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు నానిని పంపించడం వెనక కూడా సురేష్ బాబు హస్తముంది. అలాంటి సురేష్ బాబు, ఇప్పుడీ సినిమా విషయంలో సైలెంట్ అయ్యాడు. దీని వెనక కారణం కూడా అందరికీ తెలిసిందే.

సెన్సార్ కత్తెర్లు పడినప్పటికీ ఫలక్ నుమా దాస్ సినిమాపై బూతు అనే ముద్ర పడిపోయింది. దీనికి తోడు సోషల్ మీడియాలో హీరో విశ్వక్ సేన్ బూతులు మాట్లాడ్డం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఇవన్నీ ఒకెత్తయితే.. విజయ్ దేవరకొండను పరోక్షంగా విశ్వక్ సేన్ విమర్శించాడు. అది కాస్తా అతడికి, దేవరకొండ ఫ్యాన్స్ కు మధ్య గొడవగా కూడా మారింది. చివరికి ఫలక్ నుమా దాస్ పోస్టర్లు చించడం వరకు వెళ్లింది వివాదం. ఒక దశలో విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తన బూతు కామెంట్లపై క్షమాపణలు చెప్పాడు.

సినిమాపై ఇంత గొడవ జరుగుతోంది కాబట్టే సురేష్ బాబు సైలెంట్ అయ్యాడు. ఈ వ్యవహారంపై సన్నిహితుల వద్ద ఆయన చిన్నపాటి క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది.

తను కేవలం పూర్తిగా బిజినెస్ యాంగిల్ లో ఫలక్ నుమా దాస్ సినిమాను తీసుకున్నానని, తన థియేటర్లతో పాటు ఇతర ఎగ్జిబిటర్ల థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశానని, అగ్రిమెంట్ ప్రకారం వాటాలు పంచుకుంటామని సురేష్ బాబు అన్నాడట.

అంతేతప్ప, ఆ సినిమాపై ఎన్ని గొడవలు జరిగినా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం తనకు లేదని స్పష్టంచేశాడట. అంతేకాదు, మరో వారం రోజులు పోతే ఆ సినిమాకు తనకు ఎలాంటి సంబంధం ఉండదని కూడా అన్నాడట సురేష్ బాబు.