Telugu Global
NEWS

హుజూర్ నగర్ బరిలో కోదండరాం ?

నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికల బరిలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయనున్నారా? ఆ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ జనసమితికి చెందిన నాయకులు. హుజూర్ నగర్ నుంచి శాసనసభకు ఎన్నికైన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. […]

హుజూర్ నగర్ బరిలో కోదండరాం ?
X

నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికల బరిలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయనున్నారా? ఆ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ జనసమితికి చెందిన నాయకులు.

హుజూర్ నగర్ నుంచి శాసనసభకు ఎన్నికైన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. దీంతో హుజూర్ నగర్ శాసనసభ స్థానానికి పోటీ అనివార్యమైంది.

తొలుత ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి చేత పోటీ చేయించాలని భావించారు. అయితే అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఉత్తమ్ సతీమణి అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి కూడా హుజూర్ నగర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆయన మాత్రం తాను పోటీకి దూరంగా ఉన్నాను అంటూ ప్రకటించారు. దీంతో పార్టీ సరైన అభ్యర్థి కోసం వెతుకులాటలో పడింది.

నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ శాసనసభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడినుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు పర్యాయాలు గెలుపొందారు. దీంతో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ విజయం సునాయాసం అంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో హుజూర్ నగర్ నుంచి కోదండరాంను బరిలోకి దింపితే బాగుంటుందని తెలంగాణ జన సమితి నాయకులు కాంగ్రెస్ పెద్దలకు చెప్పినట్లు సమాచారం.

మిత్రపక్షాల అభ్యర్థిగా కోదండరాంను బరిలోకి దించితే శాసనసభలో ప్రశ్నించే గొంతు ఉంటుందని, ప్రభుత్వ తప్పిదాలను శాసనసభలో నిలదీసేందుకు కోదండరాం వంటి మేథావి ఉంటే భవిష్యత్తులో పార్టీకి మంచిదని తెలంగాణ జనసమితి పార్టీ నాయకుల ఆలోచన.

ఎన్నాళ్ల నుంచో తమకు కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని కాకుండా వేరొకరిని నిలబెడితే నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారా? అని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీమాంసలో పడినట్లు చెబుతున్నారు. ఈ విషయమై అధిష్టానంతో చర్చించి వారం పది రోజుల్లోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.

First Published:  3 Jun 2019 9:50 PM GMT
Next Story