బాబు మెజారిటీ ఇందుకు తగ్గిందా?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పట్ల ఆయన సొంత నియోజకవర్గ ప్రజలలో ఆదరణ తగ్గిందా? ఇలీవల జరిగిన ఎన్నికలలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు మెజారిటీ తగ్గడానికి ప్రజాదరణ తగ్గడమే కారణమా.? ముఖ్యమంత్రిగా తన సొంత నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం చేసారా…? అవుననే అంటున్నారు కుప్పం నియోజకవర్గానికి చెందిన ప్రజలు.

గురువారం నాడు ఓ ఛానల్ నిర్వహించిన చర్చా గోష్ఠిలో ఫోను ద్వారా మాట్లాడిన కుప్పం నియోజక వర్గానికి చెందిన కుల్లాయప్ప అనే స్దానికుడు చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. 1980 వ సంవత్సరం నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ భారీ మెజారిటీ వచ్చేది అని ఈ ఎన్నికలలో ఆ మెజారిటీ భారీగా పడిపోయిందని చెప్పారు. గతంలో 70 వేలు, 60 వేలు ఉన్నమెజారిటీ ఇప్పుడు సగానికి పడిపోయిందని ఆయన అన్నారు. దీనికి కారణం నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడమేనని అన్నారు.

నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ప్రజలకు త్రాగేందుకు గుక్కెడు నీళ్లు లేవని, ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పట్టించుకోలేదని కుల్లాయప్ప చెప్పారు. అలాగే ఈ మండలాలలో నలుగురు గుండాలు రాజ్యం ఏలుతున్నారని, వారిపై ఎవరైనా కేసులు పెడితే కేసులు పెట్టిన వారినే పోలీసులు అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో తొలి రౌండ్‌ పూర్తి అయ్యేసరికి చంద్రబాబు నాయుడు ఓటమి పాలవుతారా? అనే అనుమానం కూడా కలిగిందని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ స్దాపించిన ఎన్టీఆర్ తరం వారేవరు చంద్రబాబుకు ఓటు వేయలేదని వ్యాఖ్యనించారు. కుప్పం నియోజకవర్గంలోని గ్రామాలలో చంద్రబాబు నాయడిని ప్రజలు విశ్వసించటం లేదని ఆయన అన్నారు.