Telugu Global
NEWS

రాజ్యసభ సీటుకు వంద కోట్లు... బాబుపై మోత్కుపల్లి ఆరోపణ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభ సీటును 100 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని సమైక్య రాష్ట్రంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచే నైజం చంద్రబాబు నాయుడు సొంతమని, ఆయనను నమ్ముకున్న అనేకమంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు రోడ్డున పడ్డారని మోత్కుపల్లి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ దారుణ పాలన సాగించిందని, చంద్రబాబు నాయుడు ఘోరంగా […]

రాజ్యసభ సీటుకు వంద కోట్లు... బాబుపై మోత్కుపల్లి ఆరోపణ
X

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభ సీటును 100 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని సమైక్య రాష్ట్రంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

నమ్ముకున్న వారిని నట్టేట ముంచే నైజం చంద్రబాబు నాయుడు సొంతమని, ఆయనను నమ్ముకున్న అనేకమంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు రోడ్డున పడ్డారని మోత్కుపల్లి విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ దారుణ పాలన సాగించిందని, చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిపోతే తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకుంటానని మొక్కుకున్నానని మోత్కుపల్లి వివరించారు. ఆ మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వచ్చిన మోత్కుపల్లి నర్సింహులు విలేకరులతో మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీలో అనేకమంది సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు కారణంగా రోడ్డున పడ్డారని, అలాంటి నాయకుడికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పారని మోత్కుపల్లి అన్నారు.

చంద్రబాబు నాయుడు చర్యల కారణంగానే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామ రూపాలు లేకుండా పోయిందని, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి వస్తుందని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. తన స్వార్థం కోసం సొంత మామను కూడా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఎవరిని మోసం చేసేందుకైనా వెనుకాడరని మోత్కుపల్లి విమర్శించారు.

ఇదిలా ఉండగా, కుటుంబ సమేతంగా వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు నాయుడు ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతుండటంతో చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేగా తాను, తన పార్టీ తరఫున గెలిచిన శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండటంతో చంద్రబాబు నాయుడు తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

First Published:  5 Jun 2019 9:22 PM GMT
Next Story