‘లవర్స్ డే’ ఎఫెక్ట్…. అప్పుడు అలా…. ఇప్పుడు ఇలా…

కేవలం ఒక్క కన్నుగీటు వీడియోతో దేశమంతటా పాపులర్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈమెకి అప్పట్లో బోలెడు ఆఫర్ వచ్చాయి. కానీ ఆమే కాదనుకుంది. సరిగ్గా ఆమె గురించి అందరూ మర్చిపోతున్న సమయంలో ఆమె మొదటి సినిమా ఓరు అడర్ లవ్ (తెలుగులో లవర్స్ డే) విడుదలైంది. ఆ సినిమా హిట్ అయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో…. కానీ ఆ సినిమా కాస్త డిజాస్టర్ గా మారింది.

ఒకప్పుడు బోలెడు సినిమా ఆఫర్లు వచ్చినా…. ఈమెకు ఇప్పుడు ఒక్క సినిమా ఆఫర్ లభించడం కూడా గగనమయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రియా ప్రకాష్ వారియర్ కు హీరోయిన్ గా నితిన్ సినిమాలో అవకాశం దక్కింది.

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆమెకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ముందు ఈ సినిమాకి కోటి రూపాయలు పారితోషికం అనుకున్నారు. అడ్వాన్స్ గా పాతిక లక్షలు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు.

కానీ ‘లవర్స్ డే’ సినిమా విడుదలయ్యాకే ఏ సినిమాకైనా ఓకే చెప్తాను అని భీష్మించుకుని కూర్చుంది ప్రియ. కానీ సినిమా విడుదలైన తర్వాత ఓడలు బండ్లు అయ్యాయి. ఒకప్పుడు కోటి రెమ్యూనరేషన్ మాట్లాడిన అదే నిర్మాతలు ఇప్పుడు ఇరవై లక్షల పారితోషికం ఈమెకు ఇస్తున్నారు. ఒకప్పుడు పాతిక లక్షలు అడ్వాన్స్ కాదనుకొని ఇప్పుడు మొత్తంగా 20 లక్షలకు సినిమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రియా ప్రకాష్ వారియర్ కు.