2019 ప్రపంచకప్ లో రోహిత్ తొలి సెంచరీ

  • 207 వన్డేల్లో 8వేల 134 పరుగులు
  • మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్ రోహిత్ 
  • సౌతాఫ్రికా పై రోహిత్ 122 పరుగులతో నాటౌట్

టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ….ప్రపంచకప్ లో సెంచరీతో బోణీ కొట్టాడు. సౌతాఫ్రికాతో ముగిసిన తొలిరౌండ్ మ్యాచ్ లో… సూపర్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

భారత వైస్ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ తన వన్డే కెరియర్ లో ప్రపంచకప్ తొలిశతకం బాదాడు. సౌతాంప్టన్ వేదికగా ముగిసిన పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ తొలిమ్యాచ్ లో సౌతాఫ్రికాపై స్ట్రోక్ ఫుల్ సెంచరీతో తన జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.

బ్యాటింగ్ తో పాటు స్ట్రోక్ ప్లేకు అంతగా అనువుకాని సౌతాంప్టన్ వికెట్ పై రోహిత్ ప్రారంభంలో తడబడినా… ఆ తర్వాత పరిస్థితికి తగ్గట్టుగా ఆడి.. 128 బాల్స్ లో 10 బౌండ్రీలు, 2 సిక్సర్లతో శతకం పూర్తి చేశాడు.

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలసి 5వ వికెట్ కు కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. చివరకు 144 బాల్స్ లో 13 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 122 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

కెరియర్ లో రెండో ప్రపంచకప్…

తన కెరియర్ లో తొలిసారిగా 2011 ప్రపంచకప్ కు ఎంపికైన రోహిత్ శర్మ…ప్రస్తుత 2019 ప్రపంచకప్ లో మాత్రం పూర్తిస్థాయిలో బరిలోకి దిగాడు.

రెండోసారి ప్రపంచకప్ లో పాల్గొంటున్న రోహిత్…అత్యుత్తమస్థాయిలో రాణించడం ద్వారా చిరస్మరణీయంగా నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

12 ఏళ్లలో 8 వేల పరుగులు….

2007 సీజన్లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ…ఆ తర్వాత నుంచి అదేజోరు కొనసాగిస్తున్నాడు.

గత 12 సంవత్సరాల కాలంలో రోహిత్ ఆడిన మొత్తం 207 వన్డేల్లో 8వేల 132 పరుగులు సాధించాడు. ఇందులో 23 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి. 47.3 సగటు నమోదు చేసిన రోహిత్ …వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు.

డబుల్ సెంచరీల స్టార్…

వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీలు సాధించడం రోహిత్ కు సాధారణ విషయమే. 2013 సిరీస్ లో ఆస్ట్రేలియాపై తొలిసారిగా ద్విశతకం సాధించిన రోహిత్ శర్మ..ఆ తర్వాతి రెండు డబుల్ సెంచరీలు…శ్రీలంకపైనే నమోదు చేయడం విశేషం.

2014 సిరీస్ లో….264 పరుగుల ప్రపంచ రికార్డు డబుల్ సెంచరీ సాధించిన రోహిత్…ఆ తర్వాత మూడేళ్ల విరామం తర్వాత… మొహాలీలో మరో ద్విశతకం నమోదు చేయగలిగాడు.

ప్రస్తుత ప్రపంచకప్ మిగిలిన ఎనిమిదిరౌండ్ మ్యాచ్ ల్లోనూ రోహిత్ ఇదే జోరు కొనసాగించగలిగితే… భారత్ మూడోసారి ప్రపంచకప్ గెలుచుకోడం ఏమంత కష్టం కాబోదు.