ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ బెర్త్ కోసం జోకోవిచ్, థైమ్ ఫైట్

  • తొమ్మిదోసారి సెమీఫైనల్లో జోకోవిచ్
  •  గ్రాండ్ స్లామ్ టోర్నీ సెమీస్ లో 35వసారి

ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్..ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్స్ కు తొమ్మిదోసారి చేరుకొన్నాడు. ఫైనల్లో చోటు కోసం ఆస్ట్రియా ఆటగాడు డోమనిక్ థైమ్ తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

పారిస్ లోని రోలాండ్ గారోస్ సెంటర్ స్టేడియంలో ముగిసిన ఆఖరి క్వార్టర్ ఫైనల్లో జోకోవిచ్ 7-5, 6-2, 6-2తో జర్మన్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరోవ్ ను చిత్తు చేశాడు.

టాప్ సీడ్ జోకోవిచ్ కు తొలిసెట్ లో మాత్రమే గట్టిపోటీ ఎదురయ్యింది. మిగిలిన రెండుసెట్లను అలవోకగా నెగ్గడం ద్వారా తన కెరియర్ లో 35వ గ్రాండ్ స్లామ్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొన్నాడు.

నాలుగోసారి సెమీస్ లో థైమ్…

అంతకు ముందు జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రియా ఆటగాడు డోమనిక్ థైమ్…రష్యన్ ప్లేయర్ కారెన్ కచనోవ్ ను 6-2, 6-4, 6-2తో చిత్తు చేశాడు.

థైమ్ గత నాలుగేళ్లలో ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ చేరడం ఇది నాలుగోసారి కావడం విశేషం.

సెమీఫైనల్లో నంబర్ వన్ ఆటగాడు జోకోవిచ్ తో థైమ్ ఢీ కొంటాడు. జోకోవిచ్ ప్రత్యర్థిగా థైమ్ కు 2-6 రికార్డు మాత్రమే ఉంది.

తొలిసెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నడాల్ తో గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ తలపడనున్న సంగతి తెలిసిందే.