ఫ్రెంచ్ ఓపెన్ లో మహిళా వివక్ష

  • మహిళలసెమీస్ వేదిక మార్పుపై నిరసన
  • మహిళలంటే అంత అలుసా అంటూ విమర్శలు

పాశ్చాత్య దేశాలలో పురుషులు, మహిళలు సమానమేనన్నది వాస్తవం కాదని మరోసారి తేలిపోయింది. పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్లో ..మహిళా ప్లేయర్ల పట్ల నిర్వాహక సంఘం చిన్నచూపు విమర్శలకు దారితీసింది.

యాష్లీగీ బార్టీ- అమండా అనిసిమోవా, యోహానా కోంటా- మార్కెటా వోడ్రుసోవాల మధ్య జరగాల్సిన సెమీఫైనల్స్ మ్యాచ్ వేదికలను చివరి నిముషంలో మార్చడం… మహిళల పట్ల వివక్ష చూపడమేనంటూ పలువురు మండిపడుతున్నారు.
ముందుగా ప్రకటించిన కార్యక్రమం ప్రకారం…15వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న సుజానే లెంగ్లిన్ స్టేడియం వేదికగా మహిళా సెమీఫైనల్స్ జరగాల్సి ఉంది.

అయితే…భారీవర్షాల కారణంగా ఓ రోజు మ్యాచ్ లు రద్దు కావడంతో…షెడ్యూలులో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా…మహిళల సెమీఫైనల్స్ వేదికలను ప్రధాన స్టేడియం నుంచి కేవలం 5వేల సీటింగ్ సామర్థ్యం మాత్రమే కలిగిన సిమోనీ మాథ్యూ కోర్టుకు మార్చారు.

కాగా…15వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన సుజానే లెంగ్లిన్ కోర్టులో …రోజర్ ఫెదరర్- నడాల్, జోకోవిజ్- డోమనిక్ థైమ్ ల మధ్య జరగాల్సిన సెమీఫైనల్స్ ను నిర్వహించనున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

దీంతో…పలువురు ప్రముఖులు, మాజీ ప్లేయర్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మహిళల సెమీస్ వేదికలను మార్చడం… వివక్షా పూరితమేనంటూ మండి పడుతున్నారు.

ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహక సంఘం తీరుపట్ల ప్రపంచ మహిళా సమాఖ్య చీఫ్ స్టీవ్ సిమోన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

మహిళల సెమీస్ వేదిక మార్పును…మహిళలంటే గౌరవం లేదన్నట్లుగా చూడటం తగదని నిర్వాహక సంఘం చైర్మన్ గే ఫోర్గే అంటున్నారు.

ఇది కావాలని చేసిన మార్పు కాదని… పరిస్థితులకు తగ్గట్టుగా చేసిన మార్పు మాత్రమేనంటూ వివరణ ఇచ్చారు. మహిళలంటే తమకు ఎనలేని గౌరవం ఉందని…పురుషులు, మహిళలూ తమకు సమానమేనని తేల్చి చెప్పారు.

మహిళల మ్యాచ్ ల కంటే పురుషుల మ్యాచ్ లే హోరాహోరీగా సాగే అవకాశం ఉండటం, సీటింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉన్న వేదికలో మ్యాచ్ లు నిర్వహిస్తే అధిక ఆదాయం రావటమే కారణమని విమర్శకులు అంటున్నారు.