సురేష్ ప్రొడక్షన్స్-2 వస్తోంది!

గీతా ఆర్ట్స్ నిర్మాతలు ఇప్పటికే జీఏ-2 అనే బ్యానర్ పెట్టారు. ఆ బ్యానర్ పై పలు సినిమాలు కూడా నిర్మించారు. అటు హారిక-హాసిని నిర్మాతలు కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో మరో బ్యానర్ స్థాపించారు. చివరికి అన్నపూర్ణ స్టుడియోస్ సంస్థ కూడా మనం ఎంటర్ టైన్ మెంట్స్ అంటూ ఓ కొత్త బ్యానర్ స్టార్ట్ చేసింది. ఎవరి అవసరాలు వాళ్లకు ఉన్నాయి. ఇప్పుడిదే దారిలో సురేష్ బాబు కూడా నడుస్తున్నారు.

55 ఏళ్లుగా సినీరంగంలో కొనసాగుతున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు అనుబంధంగా మరో సంస్థను తెరవాలని నిర్ణయించారు సురేష్ బాబు. సురేష్ ప్రొడక్షన్స్-2 పేరిట ఇది త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇలా ఇంత సడెన్ గా సురేష్ బాబు మరో కొత్త బ్యానర్ స్థాపించడానికి కారణం ఫలక్ నుమా దాస్ సినిమా.

సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి ఫలక్ నుమా దాస్ లాంటి బూతు కంటెంట్ ఉన్న సినిమా రావడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది మాత్రమే కాదు, త్వరలోనే మరిన్ని సినిమాలు ఇదే కోవలో రాబోతున్నాయి. దీనివల్ల బ్యానర్ ప్రతిష్ట దెబ్బతింటుందని సురేష్ బాబుకు బోధపడింది. అందుకే వెంటనే మరో బ్యానర్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఇకపై తను నిర్మించే సినిమాలు మాత్రమే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తాయని, తను సమర్పించే సినిమాలు, కొడుకు రానా సమర్పించే సినిమలన్నీ సురేష్ ప్రొడక్షన్స్-2 అనే కొత్త బ్యానర్ పై నుంచి వస్తాయని క్లారిటీ ఇచ్చారు సురేష్ బాబు. అలా తండ్రి స్థాపించిన బ్యానర్ ప్రతిష్టను నిలపాలని నిర్ణయించుకున్నారు. ఇదే పనిని గీతాఆర్ట్స్ ఎప్పుడో చేసింది. ఇప్పుడు సురేష్ బాబు చేస్తున్నారు.