నేషన్స్ లీగ్ సాకర్ ఫైనల్స్ కు కౌంట్ డౌన్

  • పోర్చుగల్ తో హాలెండ్ టైటిల్ ఫైట్ 
  • సెమీస్ లో స్విట్జర్లాండ్ పై పోర్చుగల్, ఇంగ్లండ్ పై హాలెండ్ గెలుపు

పోర్చుగల్ వేదికగా జరుగుతున్న 2019 నేషన్స్ లీగ్ సాకర్ టైటిల్ సమరానికి పోర్టో వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.
ఈ సూపర్ సండే ఫైనల్లో ఆతిథ్య పోర్చుగల్ కు…సంచలనాల హాలెండ్ సవాలు విసురుతోంది.

రొనాల్డో ట్రిక్ తో ఫైనల్లో పోర్చుగల్

యూరోప్ లోని ప్రధాన దేశాలన్ని పాల్గొన్న ఈ టోర్నీ సెమీస్ లో స్విట్జర్లండ్ పైన పోర్చుగల్, ఇంగ్లండ్ పైన హాలెండ్ విజయాలు సాధించడం ద్వారా…ఫైనల్స్ కు చేరుకొన్నాయి.

పోర్టో సాకర్ స్టేడియం వేదికగా ముగిసిన తొలి సెమీఫైనల్లో …క్రిస్టియానో రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్ తో పోర్చుగల్ 3-1 గోల్స్ తో స్విట్జర్లాండ్ ను అధిగమించి ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొంది.

ఆట మొదటిభాగం లో తొలి గోల్ సాధించిన రొనాల్డో…ఆట ఆఖరి రెండు నిముషాలలో రెండు గోల్స్ సాధించి…తన జట్టుకు 3-1 గోల్స్ విజయం అందించాడు.

ప్రపంచ స్టార్ ప్లేయర్ రొనాల్డో కెరియర్ లో ఇది 53వ హ్యాట్రిక్ కావడం విశేషం.

ఇంగ్లండ్ కు డచ్ కిక్…

గుమోరెస్ సాకర్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో సెమీఫైనల్లో సైతం హాలెండ్ 3-1 గోల్స్ తో ఇంగ్లండ్ ను కంగు తినిపించింది.
హోరాహోరీగా సాగిన ఈ పోటీలో…ఎక్స్ ట్రా టైమ్ లో ఫలితం రావడం విశేషం.

ఎక్స్ ట్రా టైమ్ మొదటి భాగం లో మార్కుస్ రాష్ ఫోర్డ్ సాధించిన గోల్ తో…ఇంగ్లండ్ 1-0 ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత ఇంగ్లండ్ డిఫెండర్లు చేసిన తప్పిదాలను డచ్ ఆటగాళ్లు సమర్థవంతంగా వినియోగించుకొని…వెంట వెంటనే మూడుగోల్స్ సాధించడం ద్వారా.. సంచలన విజయం పూర్తి చేశారు.

హాట్ ఫేవరెట్ గా పోర్చుగల్…

సూపర్ సండేటైటిల్ సమరంగా సాగే …నేషన్స్ కప్ ఫైనల్లో ఆతిథ్య పోర్చుగల్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అయితే… ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన హాలెండ్ మాత్రం..డార్క్ హార్స్ గా టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది.
రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో యూరోప్ ఖండంలోని జట్లన్నీ పాల్గొంటున్నాయి.