వన్డేల్లో 300కు పైగా స్కోర్లలో ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు

  • బంగ్లాతో ప్రపంచకప్ మ్యాచ్ లో 6 వికెట్లకు 386 పరుగులు
  • వరుసగా ఏడుసార్లు 300కు పైగా స్కోర్లు సాధించిన ఒకే ఒక్క జట్టు ఇంగ్లండ్

వన్డే క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ ఇంగ్లండ్..50 ఓవర్లలో 300కు పైగా స్కోర్లు సాధించడంలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ అరుదైన ఈ ఘనత సంపాదించింది.

ఏకైకజట్టు ఇంగ్లండ్…

బంగ్లాదేశ్ తో ముగిసిన మూడోరౌండ్ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 386 పరుగుల భారీ స్కోరు సాధించింది.

వరుసగా ఏడుమ్యాచ్ ల్లో 300కు పైగా స్కోర్లు సాధించిన తొలిజట్టుగా ఇంగ్లండ్ సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు మాత్రమే చెరో ఆరుసార్లు …300కు పైగా స్కోర్లు సాధించి…సంయుక్త ప్రపంచ రికార్డు సాధించాయి.

ఇంగ్లండ్ జట్టు ఆడిన గత ఏడు మ్యాచ్ ల్లోనూ 300కు పైగా స్కోర్లు నమోదు చేయటం విశేషం.

ప్రపంచకప్ లో మూడో శతకం…

2019 వన్డే ప్రపంచకప్ లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడి రికార్డును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ సాధిస్తే..అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్ మన్ ఘనతను ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ సొంతం చేసుకొన్నాడు.

బెయిర్ స్టోతో కలసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జేసన్ రాయ్…మొదటి వికెట్ కు 128 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.

రాయ్ మొత్తం 121 బాల్స్ లో 14 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 153 పరుగుల భారీస్కోరు సాధించాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ జరిగిన 20 మ్యాచ్ ల్లో మూడు శతకాలు నమోదు కాగా…అందులో ఇంగ్లండ్ ఆటగాళ్లు రెండు, భారత ఓపెనర్ రోహిత్ శర్మ సాధించిన సెంచరీ ఉన్నాయి.