కథువా బాలిక రేప్ కేసులో ఆరుగురికి శిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ము కశ్మీర్‌లోని కథువాలో జరిగిన 8 ఏళ్ల బాలిక ఆసిఫా గ్యాంగ్ రేప్ ఘటనలో కోర్టు తమ తీర్పును వెలువరించింది.

గత ఏడాది జనవరిలో జరిగిన ఈ ఘోర సంఘటనపై విచారణ జరిపిన పఠాన్‌కోట్ ప్రత్యేక కోర్టు ఇవాళ ఆరుగురిని ఈ కేసులో దోషులుగా నిర్థారించింది. వీరిలో మాజీ ప్రభుత్వ ఉద్యోగి, ఈ ఘటనకు మూల కారకుడిగా భావిస్తున్న సంజీ రామ్ కూడా ఉన్నాడు. అతనితో పాటు ఇద్దరు పోలీసులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్‌లతో పాటు మరో ఇద్దరు దోషులుగా తేలారు.

గత ఏడాది జనవరిలో ఓ సంచార జాతి ముస్లిం బాలికను కిడ్నాప్ చేసి కథువాలోని దేవాలయంలోనికి సదరు నిందితులు తీసుకొని వెళ్లారు. ఆమెకు డ్రగ్స్ ఎక్కించి రోజుల పాటు ఆ దేవాలయంలో ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకు ఆ బాలికను బండరాయితో మోది హత్య చేశారు. ఆ తర్వాత ఆ బాలిక మృతదేహాన్ని దగ్గరలోని అటవీ ప్రాంతంలో పారేశారు.

గత ఏడాది జనవరి 17న ఆ బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించి నిందితులందరినీ అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ జూన్ 3న ముగిసింది. జైలు నుంచి కెమెరా ద్వారా విచారణ జరిపిన ఈ కేసుకు సంబంధించి ఇవాళ తీర్పు వెల్లడైంది. ఆరుగురిని నేరస్తులుగా నిర్ధారించారు. అయితే నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడు కావడంతో అతనిపై విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. అతని వయసుకు సంబంధించిన పిటిషన్ ఒకటి జమ్ము కశ్మీర్ హైకోర్టు వద్ద పెండింగ్‌లో ఉంది. హైకోర్టు అనుమతి వచ్చిన తర్వాత విచారణ మొదలవుతుంది.

ఆసిఫా రేప్, హత్య తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మతం పేరిటే ఈ దాడి జరిగిందంటూ ప్రత్యక్ష నిరసనలు, ఉద్యమాలు జరిగాయి. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై విస్తృతంగా చర్చ జరిగింది.

ఇవాళ నేరస్థులుగా నిర్థారించబడిన వీరికి కనీసం జీవిత కాలం జైలు శిక్ష లేదా ఉరి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఇంకా శిక్ష ఖరారు చేయలేదు. ఇవాళే శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంది.