అక్బరుద్దీన్‌ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం !

శాసనసభలో ఎంఐఎం పక్ష నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అరోగ్యం క్షీణించినట్లు అయన కుటుంబసభ్యులకు సమాచారం అందింది. కొంతకాలం క్రితం మెరుగైన వైద్య చికిత్స కోసం అక్బరుద్దీన్ లండన్‌ వెళ్లారు. అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతుండగానే ఆరోగ్యం క్షీణించినట్లు మజ్లిస్‌ అధినేత, అయన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.

అక్బరుద్దీన్ కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేయాలని అసద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. రంజాన్ పండుగ తర్వాత శనివారం రాత్రి దారుసలాంలో నిర్వహించిన ఈద్‌ మిలాప్‌ కార్యక్రమంలో అసదుద్దీన్ మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం గురించి వివరించారు. కొన్నేళ్ల క్రితం చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరగడంతో అప్పటి నుంచి వైద్య చికిత్సలు పొందుతున్నారు.

ప‌హిల్వాన్ గ్రూప్ జ‌రిపిన దాడిలో అక్బ‌రుద్దీన్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప‌హిల్వాన్ గ్రూప్‌లో ఓ మెంబ‌ర్ కాల్చిన బుల్లెట్ అక్బ‌రుద్దీన్ వెన్న‌ముక ప‌క్క‌నే ఉంది. దీనిని తీస్తే అక్బ‌రుద్దీన్ ప్రాణాల‌కే ప్ర‌మాద‌మ‌ని డాక్ట‌ర్లు తేల్చారు. దీంతో అప్ప‌టి నుంచి అక్బ‌రుద్దీన్ శ‌రీరంలోనే ఉండిపోయింది. అయితే ఆ బుల్లెట్ ఇప్పుడు ప్రాణాంత‌కంగా మారిన‌ట్లు తెలుస్తోంది. దీంతో పాటు అక్బరుద్దీన్ శరీరంలో కాల్చిన బుల్లెట్ అవ‌శేషాలు ఉండిపోయాయి. అవి కూడా ఇన్‌ఫెక్ష‌న్‌కు దారి తీసిన‌ట్లు తెలుస్తోంది.