కోమటి జ‌య‌రాం హ‌త్య కేసులో ఛార్జిషీట్‌

ఎక్స్ ప్రెస్ టీవీ వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్‌, ఎన్ఆర్ఐ పారిశ్రామిక వేత్త కోమటి జ‌య‌రాం హ‌త్య కేసులో విజ‌య‌వాడ పోలీసులు ఛార్జిషీటు దాఖ‌లు చేశారు. 23 పేజీల ఛార్జిషీట్‌లో 73 మందిని సాక్షులుగా చేర్చారు. ఈ హ‌త్య‌తో 12 మందికి సంబంధం ఉన్న‌ట్లు నిగ్గు తేల్చారు.

కోమటి జ‌య‌రాంను డ‌బ్బు కోసం ఆయ‌న స్నేహితుడు రాకేష్ రెడ్డి కొంద‌రి సాయంతో హ‌త్య చేసిన‌ట్లుగా పోలీసులు ఛార్జి షీట్‌లో పేర్కొన్నారు. ఈ హ‌త్య అనంత‌రం ముగ్గురు పోలీసు అధికారులు శ్రీనివాసులు, రాంబాబు, మ‌ల్లారెడ్డితో పాటు మ‌రొక‌రు రాకేష్ రెడ్డికి స‌హ‌క‌రించార‌ని పేర్కొన్నారు.

ఈ హ‌త్య కేసులో జ‌య‌రాం మేన‌కోడ‌లు శిఖా చౌద‌రిని 12 వ సాక్షిగా పేర్కొన‌డం విశేషం. జ‌య‌రాంను హ‌త్య చేయ‌డానికి ముందు రాకేష్ రెడ్డి కొంద‌రు స్నేహితుల‌తో క‌లిసి చిత్ర‌హింస‌ల‌కు గురి చేశార‌ని, పిడిగుద్దులు గుద్దుతూ ఊపిరి ఆడ‌కుండా చేశార‌ని ఛార్జిషీట్ లో పేర్కొన్నారు.

వీణ పేరుతో జ‌య‌రాంను లంచ్ కు ఆహ్వ‌నించిన రాకేష్ రెడ్డి హానీట్రాప్ వ‌ల విసిరార‌ని పేర్కొన్నారు. జ‌య‌రాం శ‌రీరంలో ఎలాంటి విష ప‌దార్దాలు లేవ‌ని గుర్తించిన పోస్టుమార్టం నివేదిక‌లో ఆయ‌నను దారుణంగా చిత్ర‌హింస‌ల‌కు గురి చేశార‌ని పేర్కొన్నారు. ఈ చిత్ర‌హింస‌ల‌ను రాకేష్ రెడ్డి వీడియో చిత్రీక‌ర‌ణ కూడా చేసిన‌ట్లు పేర్కొన్నారు. రాకేష్ రెడ్డి హ‌తుడు జ‌య‌రాం మేన‌కోడ‌లు శిఖా చౌద‌రితో స‌హ జీవ‌నం చేశార‌ని, ఆమెతో జ‌ల్సాల కోసం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశార‌ని పేర్కొన్నారు. ఆ త‌ర్వాత శిఖా చౌద‌రి వేరొక‌రితో యూర‌ప్ వెళ్ల‌డంతో తాను ఖ‌ర్చు చేసిన డ‌బ్బు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేశార‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే కోమటి జ‌య‌రాంను చిత్ర‌హింస‌ల‌కు గురి చేసి హ‌త్య చేశార‌ని పేర్కొన్నారు.