ఆంధ్రప్రదేశ్ కు చేతనైన సాయం చేస్తాం – ప్రధాని మోడీ

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మా వంతు సాయం మేం చేస్తాం. ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా కొందరు నాయకులు తేరుకోలేదు. మాకు ఎన్నికలు ముగిసాయి. ఇక మా దృష్టి అంతా ప్రజల గురించే” ఇవీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు.

దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం సాయంత్రం తిరుపతికి వచ్చారు. అధికారిక పర్యటనలో భాగంగా శ్రీలంక వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆ సమావేశంలో ప్రసంగించిన నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్ర అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఎంతో ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డికి తాము అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేకపోయినా ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.

“జగన్మోహన్ రెడ్డి చురుకైన నాయకుడు. యువకుడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయనకు కేంద్రం నుంచి కూడా వీలున్నంత సాయం చేస్తాం” అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యకర్తల సమావేశంలో హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లోను, జాతీయ స్ధాయిలోను వచ్చిన ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా కొందరు నాయకులు కోలుకోలేదని నర్మగర్భంగా అన్నారను. రానున్న ఐదు సంవత్సరాలు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని ప్రధాని అన్నారు. అనంతరం అక్కడ నుంచి తిరుమల చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

తిరుమలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు దేశ ప్రధానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, గవర్నర్ నరసింహన్ కు ఆశీర్వచనం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

అనంతరం ఈ ముగ్గురు నాయకులు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయం వరకు ఒకే వాహనంలో ప్రయాణించడం విశేషం. రాత్రి 8 గంటలకు మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు.