వైద్య చికిత్సకు నిరాకరిస్తున్న భట్టి విక్రమార్క

తెలంగాణ శాసనసభ కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షాన్నివిలీనం చేయడాన్ని నిరసిస్తూ భట్టి విక్రమార్క గడచిన మూడు రోజులుగా ఆమరణ దీక్షను చేపట్టారు. సోమవారం తెల్లవారుఝామున తెలంగాణ పోలీసులు భట్టి విక్రమార్క దీక్షను భగ్నం చేసి చికిత్స నిమిత్త ఆసుపత్రికి తరలించారు.

గత శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శాసన సభ్యులలో కొందరిని అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు సీఎల్సీ నేత భట్టి విక్రమార్క నిరసన దీక్షను చేపట్టారు.

ఆదివారం నాడు కర్ణాటక ఉపముఖ్యమంత్రి పరమేశ్వర భట్టి విక్రమార్కను పరామర్శించారు. కాంగ్రెస్ శాసనసభ పక్షం విలీనంపై ఆయన మండిపడ్డారు. ఇది జరిగిన 12 గంటల లోపు భట్టి విక్రమార్క దీక్షను భగ్నం చేసింది ప్రభుత్వం. నిజాం ఆసుపత్రిలో ఉన్న భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు పరామర్శించారు.

ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ విలీనానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఊపందుకుంటుందని, గ్రామ స్దాయిలో మరింత బలపడుతుందని భయపడిన ప్రభుత్వం భట్టి విక్రమార్క దీక్షను భగ్నం చేసిందని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు బుద్ది చెబుతారని ఆయన వ్యాఖ్యనించారు. ఇది ఇలా ఉండగా చికిత్స నిమిత్తం నిమ్స్ కు బలవంతంగా తరలించిన భట్టి విక్రమార్క వైద్యానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం.