28 సంవత్సరాల తర్వాత కలవబోతున్న వెంకటేష్, టబు

గత కొంత కాలంగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ప్రముఖ నటి టబు చాలా కాలం తర్వాత మళ్లీ టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో ఈమె ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే మరొక సినిమాకు సైన్ చేసింది ఈ భామ. ఈ మధ్యనే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన టబు నటించిన ‘దే దే ప్యార్ దే’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

తాజాగా ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

హిందీలో ఆమె చేసిన పాత్రలోనే…. తెలుగులో కూడా కనిపించబోతోంది. ఈ సినిమా కోసం దర్శకుడిని ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటేష్ ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత రీమేక్ సినిమాపై దృష్టి పెట్టనున్నారు.

ఈ చిత్ర రీమేక్ రైట్స్ ను సురేష్ బాబు కొనుక్కున్నారు. సురేష్ బాబు ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. 1991లో వెంకటేష్, టబు కలిసి ‘కూలి నెంబర్ వన్’ సినిమా లో హీరో హీరోయిన్లుగా నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు వీరి కాంబినేషన్ తెరపైకి రానుంది.