ప్రపంచకప్ లో రెండుదేశాలకు ఆడిన ఆటగాళ్లు

  • రెండుజట్లకు ప్రాతినిథ్యం వహించిన నలుగురు ఆటగాళ్లు

నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ లో ఒక్కసారి పాల్గొన్నా తమ జన్మధన్యమైనట్లేనని క్రికెటర్లు భావించడం సహజం. అయితే…. ఒకటి కాదు ఏకంగా రెండుదేశాల జట్లకు ఆడిన క్రికెటర్లు సైతం లేకపోలేదు.

నాలుగున్నర దశాబ్దాల ప్రపంచకప్ చరిత్రలో 1975 ప్రారంభ ప్రపంచకప్ నుంచి ప్రస్తుత 2019 ప్రపంచకప్ వరకూ… వివిధ దేశాలకు చెందిన వందలమంది ఆటగాళ్లు పాల్గొన్నా… కేవలం నలుగురంటే నలుగురికి మాత్రమే ప్రత్యేక స్థానం, ఓ అరుదైన రికార్డు ఉన్నాయి.

వెసల్స్ టు మోర్గాన్…

వన్డే ప్రపంచకప్ లో రెండుదేశాల జట్ల తరపున బరిలోకి దిగిన ఆటగాళ్లలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ కెప్లర్ వెసల్స్ పేరు మాత్రమే ముందుగా గుర్తుకు వస్తుంది.

1983 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా కు ప్రాతినిథ్యం వహించిన కెప్లర్ వెసల్స్ …ఆ తర్వా…ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 1992 ప్రపంచకప్ లో మాత్రం సౌతాఫ్రికా కెప్టెన్ గా వ్యవహరించాడు. ప్రపంచకప్ చరిత్రలోనే రెండుదేశాలజట్లలో సభ్యుడిగా ఉన్న తొలి క్రికెటర్ గా వెసల్స్ రికార్డుల్లో చేరాడు.

ఐరిష్ క్రికెటర్ ఎడ్ జోయ్స్ ప్రపంచకప్ లో ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్ గా నిలిచాడు. 2007 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ జట్టులో ఆల్ రౌండర్ గా బరిలోకి దిగిన జోయ్స్…2011 ప్రపంచకప్ లో మాత్రం ఐర్లాండ్ జట్టు తరపున బరిలోకి దిగాడు.

కమిన్స్…విండీస్ టు కెనడా…

కరీబియన్ ఆల్ రౌండర్ యాండర్సన్ కమిన్స్ సైతం ప్రపంచకప్ లో రెండు దేశాలకు ఆడిన క్రికెటర్ల వరుసలో నిలిచాడు. వెస్టిండీస్ తరపున 1992 ప్రపంచకప్ లో పాల్గొన్న కమిన్స్ … 2007 ప్రపంచకప్ లో మాత్రం కెనడా జట్టులో సభ్యుడిగా పోటీకి దిగాడు.

మోర్గాన్…ఐర్లాండ్ టు ఇంగ్లండ్…

ప్రస్తుత ప్రపంచకప్ లో ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న వోయిన్ మోర్గాన్ గతంలో ఐర్లాండ్ జట్టు తరపున ప్రపంచకప్ లో పాల్గొన్నాడు.

2007 ప్రపంచకప్ లో ఐర్లాండ్…2019 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ కు మోర్గాన్ ప్రాతినిథ్యం వహించాడు.

ఆరు ప్రపంచకప్ ల సచిన్, జావేద్..

ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న ఆటగాళ్లుగా భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్, పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ నిలిచారు.

మాస్టర్ సచిన్ 1992 నుంచి 2011 ప్రపంచకప్ వరకూ విడవకుండా వరుసగా ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా డబుల్ హ్యాట్రిక్ సాధించాడు.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ సైతం ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా సచిన్ సరసన నిలిచాడు.