ముందు ముఖ్య‌మంత్రి…. త‌ర్వాత ప్ర‌తిప‌క్ష నేత‌ల ప్ర‌మాణం

బుధ‌వారం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు శాస‌న‌స‌భ‌కు నూత‌నంగా ఎంపికైన స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారం ఉంటుంది. ముందుగా ముఖ్య‌మంత్రి, శాస‌న‌స‌భ నాయ‌కుడు వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శాస‌న‌స‌భ్యుడిగా ప్ర‌మాణం చేస్తారు.

ఆయ‌న త‌ర్వాత ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నాయ‌కుడు నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణం చేస్తారు. వీరి చేత ప్రొటెం స్పీక‌ర్ ప్ర‌మాణం చేయిస్తారు. వీరిద్ద‌రి త‌ర్వాత సీనియారిటీ ప్ర‌కారం కాని, అక్ష‌ర క్ర‌మంలో కాని అధికార, ప్ర‌తిప‌క్ష శాస‌న‌స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారం ఉంటుంది.

బుధ‌వారం నాడు స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత స‌భ వాయిదా ప‌డుతుంది. తిరిగి గురువారం ఉద‌యం శాస‌న‌స‌భ స‌మావేశ‌మై స్పీక‌ర్ ను ఎన్నుకుంటుంది. ఇప్ప‌టికే ఆ ప‌ద‌వికి ఆముదాలవ‌ల‌స నుంచి శాస‌న‌స‌భ్యుడిగా ఎన్నికైన త‌మ్మినేని సీతారాం పేరును ఖ‌రారు చేశారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

స్పీక‌ర్ ఎన్నిక పూర్తి అయిన త‌ర్వాత ఆయ‌న ఎంపిక‌పై ముఖ్యమంత్రితో స‌హా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మంత్రులు, ఇత‌ర శాస‌న‌స‌భ్యులు స్పీక‌ర్ ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. అనంత‌రం స‌భ వాయిదా ప‌డుతుంది. ఇక శాస‌న‌స‌భ చివ‌రి రోజైన శుక్ర‌వారం అంటే 14 వ తేదీన శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లి స‌భ్యుల‌నుద్దేశించి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్ర‌సంగిస్తారు.

శాస‌న‌స‌భ‌ను తాము హుందాగా న‌డుపుతామ‌ని, ప్ర‌తిప‌క్ష స‌భ్యులంద‌రికి మాట్లాడే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మంగ‌ళ‌వారం నాడు విలేక‌రుల‌తో అన్నారు. గ‌త ప్ర‌భుత్వంలో ప్ర‌తిప‌క్షం గొంతు నొక్కేశార‌ని, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి ఛాంబ‌ర్ కూడా ఇవ్వ‌కుండా అవ‌మానించార‌ని అన్నారు. అయితే, తాము మాత్రం అలా ప్ర‌వ‌ర్తించ‌మ‌ని, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి ఇవ్వాల్సిన గౌర‌వం ఇస్తామ‌ని అన్నారు.