క్రికెట్ వ్యాఖ్యానం…. కాసులకు సోపానం

క్రికెట్…మూడక్షరాల ఈ ఆట ఆటగాళ్లకు మాత్రమే కాదు…మాజీ క్రికెటర్లకు సైతం కాసుల వర్షం కురిపిస్తోంది. క్రికెటర్లు , క్రికెట్ అంపైర్లు, కోచ్ లు, క్యూరేటర్లు, మ్యాచ్ రిఫరీలు ..ఇలా క్రికెట్ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న పలురకాల వ్యక్తులు రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఇలాంటివారి జాబితాలో క్రికెట్ వ్యాఖ్యాతలు సైతం వచ్చి చేరారు.

ఇంగ్లండ్ లో పుట్టి…బ్రిటీష్ పాలిత, భారత ఉపఖండ దేశాలకు విస్తరించిన క్రికెట్ ఇప్పుడు సకలజన మనోరంజక క్రీడ మాత్రమే కాదు.. క్రికెట్ తో అనుబంధం ఉన్న వివిధ వర్గాలవారికి జీవనోపాధిగా మారింది.

అంతర్జాతీయ, జాతీయస్థాయిలో పేరున్న క్రికెటర్లు రెండు చేతులా ఆర్జిస్తున్నారు. అంతేకాదు…రిటైర్మెంట్ తర్వాత సైతం భారీమొత్తంలోనే సంపాదిస్తున్నారు.

క్రికెట్ వ్యాఖ్యానంతో…

ప్రపంచీకరణ పుణ్యమా ఉంటూ క్రికెట్ ఓ వ్యాపార క్రీడగా మారిపోయింది. ప్రధానంగా భారత ఉపఖండ దేశాలతో పాటు…ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా లాంటి దేశాలలో కోట్లాదిమంది అభిమానులున్న క్రీడగా మారిపోయింది.

దీనికితోడు…అంతర్జాతీయ క్రికెట్ మండలి , భారత క్రికెట్ నియంత్రణ మండలి… క్రికెట్ ను వేలకోట్ల రూపాయల వినోదంగా, వ్యాపారంగా తీర్చిదిద్దడంలో సఫలమయ్యాయి.

ఐపీఎల్ తో డబ్బే డబ్బు….

భారత క్రికెట్ బోర్డు గత 11 సీజన్లుగా నిర్వహిస్తున్న ఐపీఎల్ నిన్నటి, నేటి తరం క్రికెటర్లపాలిట బంగారుబాతుగా మారింది. విరాట్ కొహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్ లాంటి క్రికెటర్లు మాత్రమే కాదు ..సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, రవి శాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, అనీల్ కుంబ్లే, శివరామకృష్ణన్, ఆకాశ్ చోప్రా లాంటి రిటైర్డ్ క్రికెటర్లు సైతం…క్రికెట్ వ్యాఖ్యాతలుగా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.

క్రికెట్ వ్యాఖ్యానమూ ఓ కళే…

క్రికెటర్లందరూ వ్యాఖ్యాతలు కారు. క్రికెట్ ఆడటం ద్వారా సాంకేతికంగా ఆటపట్ల అవగాహన ఉన్నా..చక్కగా విశ్లేషించడం, మనసుకు హత్తుకొనేలా వ్యాఖ్యానించడం ఏమంత తేలికకాదు. ఆట పైన సమగ్ర అవగాహన, కమనీయంగా వ్యాఖ్యానించడానికి అవసరమైన భాషాసంపద, ఉచ్ఛారణ ఉండితీరాలి.

క్రికెట్ ప్రత్యక్షప్రసార హక్కుల మార్కెట్లో స్టార్ నెట్ వర్క్, సోనీ నెట్ వర్క్, టెన్ క్రికెట్ లాంటి సంస్థలు..నాణ్యమైన కామెంటీటర్లకు భారీ కాంట్రాక్టులు ఇస్తూ ఆదరిస్తున్నాయి.

ఐపీఎల్ వ్యాఖ్యాతలుగా… సునీల్ గవాస్కర్, భారత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి లాంటి మాజీ క్రికెటర్లు ఏడాదికి నాలుగు నుంచి ఆరు కోట్ల రూపాయల వరకూ అందుకొంటూ వచ్చారు.

భారత మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లే రోజుకు 2 నుంచి 2 లక్షల 50 వేల రూపాయల వరకూ ఫీజుగా ఆర్జిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ సీజన్లో 60 రోజులకు గాను..అనీల్ కుంబ్లేకి 90 లక్షల రూపాయల మొత్తాన్ని ఐపీఎల్ బోర్డు చెల్లించింది.

భారత మాజీ క్రికెటర్లు మాత్రమే కాదు…ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జింబాబ్వే, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాక్ దేశాల మాజీ క్రికెటర్లతో పాటు మహిళా మాజీ క్రికెటర్లు సైతం క్రికెట్ వ్యాఖ్యాతలుగా దండిగానే సంపాదిస్తున్నారు.

ప్రపంచకప్ లో సైతం…

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ప్రారంభమైన 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ ప్రత్యక్ష ప్రసారానికి..అధికారిక బ్రాడ్ కాస్టర్
స్టార్ నెట్ వర్క్ విస్త్రృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

11 వేదికల్లో 46 రోజులపాటు 48 మ్యాచ్ లుగా సాగే ఈ టోర్నీ కోసం…మొత్తం 10 దేశాలకు చెందిన 24 మంది వ్యాఖ్యాతల బృందాన్ని స్టార్ నెట్ వర్క్ ఎంపిక చేసింది.

భారత్ నుంచి సౌరవ్, మంజ్రేకర్, బోగ్లే…

24 మంది ప్రపంచకప్ కామెంటీటర్ల బృందంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, సంజయ్ మంజ్రేకర్, హర్షా బోగ్లే చోటు దక్కించుకొన్నారు.

10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ కమ్ సెమీఫైనల్స్ నాకౌట్ గా జరిగే ఈ పోటీల ఇతర వ్యాఖ్యాతలలో…మైకేల్ క్లార్క్, మైకేల్ స్లేటర్, వసీం అక్రం, రమీజ్ రాజా, వకార్ యూనిస్, కుమార సంగక్కర, పామీ ఎంబాగ్వా, అతర్ అలీ ఖాన్, మైకేల్ హోల్డింగ్, ఇయాన్ బిషప్, మైకేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్, ఇయాన్ వార్డ్, సైమన్ డూల్, ఇయాన్ స్మిత్, బ్రెండన్ మెకల్లమ్, గ్రీమ్ స్మిత్ ,షాన్ పోలాక్ ఉన్నారు.

ముగ్గురు మహిళా కామెంటీటర్లు…

క్రికెట్ వ్యాఖ్యాతల బృందంలో ముగ్గురు మహిళా మాజీ క్రికెటర్లకు సైతం ఐసీసీ చోటు కల్పించింది. ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇషా గుహ, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మెల్ జోన్స్, అలీసన్ మిషెల్ ఉన్నారు.

భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ లిసా స్థాలేకర్ సైతం క్రికెట్ వ్యాఖ్యాతలుగా చక్కటి గుర్తింపు తెచ్చుకొన్నారు.

మొత్తం మీద క్రికెటర్లుగా మాత్రమే కాదు…రిటైర్డ్ క్రికెటర్లుగానూ భారీ మొత్తాలలో సంపాదించడానికి క్రికెట్ వ్యాఖ్యానానికి మించినదారి మరొకటి లేదంటే ఆశ్చర్యమే మరి.