జగన్ నిర్ణయాలు…. తమ్ముళ్ల గుండెల్లో గుబులు…!

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మంత్రివర్గ కూర్పుతోనే సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అంటున్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే గుబులు తెలుగు తమ్ముళ్లలో రేపుతోంది. పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల హామీని అమలు చేయడం ఏ ముఖ్యమంత్రికీ సాధ్యం కాదంటూ విమర్శించిన తెలుగుదేశం నాయకులకు… వాటిని అమలు చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు మింగుడుపడటం లేదని అంటున్నారు.

తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఏ వర్గాలను చిన్న చూపు చూసిందో ఆ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరువ అవుతున్నారని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

ఆశా వర్కర్ల జీతాలను పెంచుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఫైల్ పై సంతకం చేయడం రాజకీయ డ్రామాగానే పరిగణించిన తెలుగు తమ్ముళ్లకు తొలి మంత్రివర్గ సమావేశంలోనే దానిని ఆమోదించడం ఆశనిపాతంలా మారిందంటున్నారు.

మంత్రివర్గంలో బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలు, తెలుగుదేశం పార్టీకి దూరమైన కాపు సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి…. ఉద్యోగుల్లో అట్టడుగు స్థాయి వారిని కూడా సంతృప్తి పరిచేలా నిర్ణయాలు తీసుకోవడం తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మింగుడు పడడం లేదంటున్నారు.

ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తప్ప ప్రభుత్వంపై పోరాడేందుకు తమకు ఎలాంటి అవకాశం ఉండదని తెలుగు తమ్ముళ్లు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.