మంత్రులు అవినీతికి పాల్పడితే తొలగింపే…. ఇది జగన్ నిర్ణయం

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన హామీల్లో కొన్నింటిని ఇప్పటికే అమలు చేశారు. ఈ నేపథ్యంలో తొలి క్యాబినెట్ భేటీలో మరికొన్నింటికి ఆమోద ముద్ర వేశారు.

కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. మంత్రులు ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే తక్షణమే విచారించి తొలగిస్తానని సీఎం జగన్ హెచ్చరించినట్లు తెలిపారు. ప్రతీ శాఖలోనూ అవినీతి జరగకుండా మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారని ఆయన అన్నారు.

తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వంలా ఉండాలని.. అందుకు తగ్గట్లుగా వ్యవసాయానికి పెద్ద పీఠ వేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇవాళ పలు నిర్ణయాలపై కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని నాని చెప్పారు.

ఉగాది రోజున పేద మహిళలకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నామని.. అలాగే సీపీఎస్ రద్దు సూత్రప్రాయంగా మంత్రి మండలిలో ఆమోదం పొందిందని.. దానిపై ఒక కమిటీ వేసి అధ్యయనం చేశాక పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోనున్నట్లు నాని చెప్పారు.