Telugu Global
NEWS

ఏపీలో విద్వేషాలు ఇంకా చల్లారలేదు....

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో మొదలైన రాజకీయ దాడులు ఇంకా ఆగలేదు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య యుద్ధ వాతావరణం ఇప్పటికీ నెలకొని ఉంది. చిన్న చిన్న కారణాలకు కూడా కత్తులు, బరిసెలతో దాడులు చేసుకునే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఇప్పటి దాకా పోలీసుల అండతో చెలరేగిపోయిన తెలుగుదేశం కార్యకర్తలకు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలనుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. పోలీసులు కూడా గతంలోలాగా తెలుగుదేశానికి కొమ్ముకాయడం లేదు.  మరికొన్ని […]

ఏపీలో విద్వేషాలు ఇంకా చల్లారలేదు....
X

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో మొదలైన రాజకీయ దాడులు ఇంకా ఆగలేదు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య యుద్ధ వాతావరణం ఇప్పటికీ నెలకొని ఉంది.

చిన్న చిన్న కారణాలకు కూడా కత్తులు, బరిసెలతో దాడులు చేసుకునే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఇప్పటి దాకా పోలీసుల అండతో చెలరేగిపోయిన తెలుగుదేశం కార్యకర్తలకు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలనుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. పోలీసులు కూడా గతంలోలాగా తెలుగుదేశానికి కొమ్ముకాయడం లేదు.

మరికొన్ని చోట్ల తాము అధికారంలోకి రాలేకపోయామని ఆగ్రహంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అధికారం తమదే అని అత్యుత్సాహంతో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు.

ఈ దాడులతో అమాయకులైన కొందరు మృత్యువాత పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలోని కొన్ని నియోజకవర్గాల్లోనూ, అనంతపురం, కర్నూలు నియోజకవర్గాల్లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడం ప్రతినిత్యం జరుగుతోంది.

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం బీ.కొత్తూరులో ఎన్నికల సమయంలో ప్రారంభమైన దాడులు ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా కొలిమిగండ్ల మండలం చింతలాయపల్లే గ్రామంలో తెలుగుదేశం, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. దీంతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎన్నికల సమయంలో ప్రారంభమైన రాజకీయ దాడులు అవి ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగడం గ్రామాలలో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇంతకు ముందు పోలీసుల అండదండలతో చెలరేగిపోయిన వారు ఇప్పుడు ఎలాంటి అండ లేకపోవడంతో అసహనంతో రెచ్చిపోతున్నారని బాధితులు చెబుతున్నారు.

నూతన హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి మేకతోటి సుచరిత తక్షణ కర్తవ్యం ఈ రాజకీయ దాడులను నిలువరించడమేనంటున్నారు. ఈ దాడులకు బాధ్యులైన వారు ఏ పార్టీకి చెందిన వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఏపీలో రాజకీయ కక్షలకు ఫుల్ స్టాప్ పడదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  10 Jun 2019 11:23 PM GMT
Next Story