“క్లాప్” కొట్టిన ఆది

ఆది కొత్త సినిమా ప్రారంభమైంది. దీనికి క్లాప్ అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు. నిజానికి ఇది క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా. దీనికి క్లాప్ అనే టైటిల్ కు సంబంధం ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలంటున్నారు మేకర్స్. స్వరజ్ఞాని ఇళయరాజా ఈ సినిమాకు క్లాప్ కొట్టడం విశేషం. అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేయగా, అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈ మూవీ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది.

ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తోంది. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి ఆదిత్య దర్శకుడిగా బిగ్ ప్రింట్ పిక్చర్స్ అండ్ సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లు పై ఐబి కార్తికేయన్, యం.రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా “క్లాప్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తారు.

సినిమాలో కోచ్ పాత్రలో కనిపించబోతున్నాడు ఆది. ఓ అధ్లెట్ జీవితంలో జరిగిన పెను మార్పుల నేపథ్యంలో క్లాప్ సినిమా తెరకెక్కనుంది. నాజర్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, మీనా ఇతర ముఖ్యపాత్రలు పోషించబోతున్నారు. ఈ నెల 17నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి.. హైదరాబాద్, చెన్నయ్, బెంగుళూరు, మధురైలలో షూటింగ్ చేస్తారు. మొత్తం నాలుగు షెడ్యూల్స్ లో ఈ సినిమాను పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.